అటకెక్కిన ఎస్ఎన్డీపీ పనులు

by Muthe.Rajitha |

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నా నాలాల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

అటకెక్కిన ఎస్ఎన్డీపీ పనులు
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నా నాలాల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రతి ఏటా పూడిక తీత పేరున, నాలాలా అభివృద్ధి పేరిట రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం నామమాత్రమేనని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఎన్డీపీ(స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) పనుల కోసం జీహెచ్ఎంసీ లోన్లు తీసుకున్నది. పనుల్లో నాణ్యత లేకపోవడం, ప్రణాళికాబద్ధంగా చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌లోని పలు చోట్ల వర్షాకాలంలో నాలాల రిటైనింగ్ వాల్ కొట్టుకపోవడం, నాలాలు కుంగిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐదేండ్లుగా ఎస్ఎన్డీపీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా వర్షాకాలంలో పలు కాలనీలు నీటమునిగిన విషయం తెలిసిందే. అయితే ఎస్ఎన్డీపీ పనుల్లో నాణ్యత నామమాత్రంగానే ఉందని పలువురు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.

రూ.680 కోట్ల అప్పులు

గ్రేటర్‌లో సుమారు 1,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నాలాలను అభివృద్ధి చేసేందుకు, వరద ముంపు ప్రమాదాన్ని తగ్గించేందుకుగానూ ఎస్ఎన్డీపీ తీసుకొచ్చారు. దీనికోసం రూపీటర్న్ లోన్ ద్వారా రూ.680 కోట్ల అప్పులు తీసుకున్నారు. ఎస్ఎన్డీపీ మొదటి దశ 2021లో 78.31 కి.మీల నాలాలను 46 పనులుగా చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ సగం పనులు కూడా పూర్తికాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండో దశ 2024లో 450 కి.మీల మేర 415 పనులను చేపట్టారు.

సికింద్రాబాద్ జోన్ పరిధిలో..

సికింద్రాబాద్ జోన్ పరిధిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రూ.1.61 కోట్లతో పనులను పూర్తిచేశారు. ఎంప్లాయి కాలనీ-సాయి ఎన్‌క్లేవ్ (నేరేడ్‌మెట్ కూడలి) వరకు రూ.6.26 కోట్లు, బండచెరువు ఆర్టీసీ కాలనీ వరకు రూ.1.74 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులు తీసుకున్నారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

చార్మినార్ జోన్ పరిధిలో..

చార్మినార్ జోన్ పరిధిలోనూ పనులు నామమాత్రంగా ఉన్నాయి. బిస్మిల్లా కిరాణ స్టోర్-అలీ హోటల్ వరకు రూ.1.61 కోట్లు, మిల్లెట్ నగర్-బిస్మిల్లా కిరాణ స్టోర్ వరకు రూ.2.54 కోట్లు, అరోరా కాలేజ్ మన్మాన్ కుంట వరకు రూ.4.62 కోట్లు, డబీర్పూర్ దర్వాజ-ఫరాహత్ నగర్ ఓపెన్ నాలాకు రూ.11.55 కోట్లు, మౌలాకా చిల్లా-హైదరాబాద్ ఇస్లామిక్ స్కూల్ వరకు రూ.6.55 కోట్లు, బండ్లగూడ హౌసింగ్ కాలనీ-ఎర్రకుంట వరకు రూ.33 కోట్లు, మురికినాలా నన్ని గార్డెన్ శివాజీనగర్ వరకు రూ.27.50 కోట్లు, నూరమ్మ చెరువు-మీర్ఆలం ట్యాంక్ వరకు రూ.53.35 కోట్లు, అరుంధతీ నగర్ అక్బర్ నగర్ వరకు మురికినాలాకు రూ.9.9 కోట్లు, కిషన్ బాగ్ రోడ్-మూసీనది వరకు రూ.8.47 కోట్లు, యాకుత్‌పురా-అమన్ నగర్ తలాబ్ కట్ట వరకు పరిపాలనా అనుమతులను తీసుకున్నారు. పనులు పురోగతిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ పూర్తిచేసిన పనుల్లో నాణ్యతలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలో తమకు తిప్పలు తప్పడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్బీనగర్ జోన్ పరిధిలో

పెద్దచెరువు(నాచారం)-నల్లచెరువు(ఉప్పల్) వరకు రూ.22.38 కోట్లు, రామాంతాపూర్ చెరువు-ఉస్మానియా యూనివర్సిటీ వరకు రూ.12.61 కోట్లతో పనులు చేపట్టారు. రెడ్డి కాలనీ-జేఎస్ రెడ్డి స్విమ్మింగ్ పూల్ వరకు రూ.9.66 కోట్లు, కేకే గార్డెన్ నందనపురి కాలనీ వరకు రూ.7.49 కోట్లు, ఈసీ నగర్ కమాన్-రాంపల్లి లేక్ వరకు రూ.37.07 కోట్ల పనులు చేపట్టారు. కృష్ణానగర్-సాకేత్ ఆదర్శ నగర్ వరకు రూ.29.45 కోట్లు, తిరుమల హాస్పిటల్-సాగర్ రింగ్ రోడ్ వరకు రూ.12.94 కోట్లతో పనులు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

ఖైరతాబాద్ జోన్ పరిధిలో..

లక్డీకాపూల్ న్యూ ప్రగతి ప్రెస్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు రూ.17.93 కోట్లు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మూసీ రివర్ వరకు రూ.4.28 కోట్లు, ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు రూ.4.62 కోట్లు, వెస్టర్న్ ప్లాజా-లిమ్రా కేఫ్ వరకు రూ.47.08 కోట్లతో పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

శేరిలింగంపల్లి జోన్ పరిధిలో..

గఫార్ నగర్ జంక్షన్ వద్ద దుర్గం చెరువు-పటేల్ చెరువు వరకు రూ.11.85 కోట్లు, గురునాథ్ చెరువు-పటేల్ చెరువు వరకు రూ.6.8 కోట్లు, నల్లగండ్ల సరన్ నాలా-నేతాజీనగర్ వరకు రూ. 28.45 కోట్లు, అంబేద్కర్ కాలనీ శిశుమందిర్ వరకు రూ.6.06 కోట్లు, జనార్ధన్ హిల్స్-ఖాజాగూడ పెద్దచెరువు వరకు రూ.13.86 కోట్లు, పటేల్ చెరువు-గంగారం చెరువు వరకు రూ.18.92 కోట్లు, బండ్లగూడ చెరువు-తిమ్మక్క కుంట వరకు రూ.17.23 కోట్ల పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీచేసింది. ఈ పనులన్నీ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కూకట్‌పల్లి జోన్ పరిధిలో

కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మైసమ్మ చెరువు-దీన్ దయాళ్ నగర్ వరకు రూ.31.8 కోట్లు, ఐడీఎల్ కూకట్‌పల్లి నాలా వరకు రూ.17.37 కోట్లు, బోయిన్ చెరువు నాలా రీమోడలింగ్‌కు రూ.7.10 కోట్లు కేటాయించారు. మైసమ్మ చెరువు వరకు రూ.29.18 కోట్లు, పర్కిచెరువు నాలా వరకు రూ.8.76 కోట్లు, కూకట్‌పల్లి బస్ డిపో-గౌతంనగర్ వరకు రూ.33 కోట్లతో పనులు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

Next Story