ఎమ్మెల్యే ఆశావహుల హల్చల్.. ఒకే పార్టీలో ఎవరికి వారు ప్రచారం..

by Disha Web Desk 20 |
ఎమ్మెల్యే ఆశావహుల హల్చల్.. ఒకే పార్టీలో ఎవరికి వారు ప్రచారం..
X

దిశ, శేరిలింగంపల్లి : క్రమ శిక్షణకు మారుపేరైన భారతీయ జనతాపార్టీలో ఇప్పుడు అది మచ్చుకైనా కానరావడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా నాయకులు వేరు కుంపట్లు పెట్టుకుంటూ గిల్లికజ్జాలు ఆడుతున్నారు. ఎవరికి వారు తమకంటే తమకే టికెట్ అంటూ సొంత బాకాలు ఊదుకుంటూ కార్యాలయాలు ప్రారంభించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా ప్రచార రథాలు కూడా తయారు చేసుకుని గల్లీల్లో తిరిగేస్తూ ప్రచారాలు మొదలు పెట్టారు. కొందరు నాయకులు, ఓ లీడర్ ఇంటింటికి బీజేపీ అంటే మరో నాయకుడు గడపగడపకు కమలం పార్టీ అంటూ నియోజకవర్గ వ్యాప్తంగా గల్లీలు చుట్టేస్తున్నారు. మధ్యలో మేమేం తక్కువ కాదంటూ మరో ముగ్గురు నాయకులు ఐక్యతా రాగం వినిపిస్తూ మేమున్నామంటూ మరో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే వీటన్నింటిని దగ్గరుండి మరీ ప్రారంభిస్తున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

ఎవరికి వారే..

శేరిలింగంపల్లి బీజేపీలో ఒక్కో నాయకుడిది ఒక్కో తరహా వ్యవహారం. లీడర్లు అనుకునే ప్రతీ నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఆశావాహులే. ఎవరికి వారు మేమేం తక్కువ కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పా.. అందరినీ కలుపుకుని పోయి పార్టీ పటిష్టత కోసం కలిసికట్టుగా పనిచేస్తామనే నాయకులు మచ్చుకైనా కానరావడం లేదని ఆపార్టీ సానుభూతిపరులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నామని ప్రచారం చేసుకుంటున్న కొందరు నాయకులు ఇప్పటికే ఆయా డివిజన్లను చుట్టేస్తూ ఇంటింటికి పాదయాత్రలు చేస్తున్నారు. అంతేకాదు ఒకరిద్దరు నాయకులు ఇంకాస్త ముందుకు వెళ్లి రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏకంగా ప్రచార రథాలను కూడా రెడీ చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇంకొందరు నాయకులు ప్రచార రథాలకు ఆర్డర్లు కూడా ఇచ్చేశారట. ఇలా ఎవరికి వారే తామే అభ్యర్థులం అంటూ అన్ని రకాలుగా రెడీ అవుతుండడం ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.

పెయిడ్ కార్యకర్తలు..

టికెట్ ఆశావహులు పలురకాల కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నా.. ఈ కార్యక్రమాల్లో అసలైన పార్టీ కార్యకర్తలకంటే చాలా వరకు పెయిడ్ కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఓ నాయకుడు నిర్వహించిన పాదయాత్రలో అడ్డా కూలీలు, వృద్ధులు, పిల్లలను ఎత్తుకుని ఇబ్బందులు పడుతున్న మహిళలు ఎక్కువగా కనిపించారు. అదేంటి అంటే ఎవరికి వారు పాదయాత్రలు చేస్తే ఎవరు ఎక్కడికి వెళ్తారని, అడ్డా కూలీలు కాకుండా ఇంకెవరు వస్తారంటూ ఆయన అనుచరగణమే చెప్పుకోవడం నాయకుల పరిస్థితికి అద్దం పడుతుంది. ఒకరికిని మించి మరొకరు పాదయాత్రలు చేస్తున్న వీరికి అడ్డా కూలీలే దిక్కవుతున్నారు. ఎక్కడ పాదయాత్ర ఉంటే అక్కడికి వచ్చేలా ముందే ఆయా నాయకుల అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారట. ఎన్నికలకు ముందే ఉపాధి దొరుకుతుండటంతో కష్టమైనా పాదయాత్రలో పాల్గొంటూ ఉపాధి పొందుతున్నారు అడ్డా కూలీలు. ఇలాగైనా తమకు రోజు కూలీ దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మేమేం తక్కువ కాదు..

బీజేపీ నాయకుల వైఖరి పార్టీ పెద్దలకు, సీనియర్లకు కూడా తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఇటీవల ఓ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. నియోజకవర్గ నాయకులు అందరూ హాజరైన ఈ కార్యక్రమంలో ఓ నాయకుడి వ్యవహార శైలిపై స్వయంగా ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయనొక్కడనే కాదు మరికొందరు నాయకుల తీరుపై కూడా బీజేపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. అయితే శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులను అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చే బాధ్యతను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భుజాన వేసుకున్నారట.

ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న నాయకులు ఎవరు పార్టీ ఆఫీసులు ప్రారంభించినా, మరోటి చేసినా దగ్గరుండి మరీ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. చివర్లో పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యే రేసులోకి కొండా వచ్చినా రావచ్చని, లోకల్ నాయకుల మధ్య ఉన్న అనిశ్చితికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీజేపీ పెద్దలు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయని, ఆర్ఎస్ఎస్ ఇతర బీజేపీ అనుబంధ సంఘాల కూడా ఆయన పేరునే తెరమీదకు తెస్తున్నట్లు అంతర్గత సమాచారం.


Next Story

Most Viewed