ప్రజల ఆరోగ్యమే సమాజ అభివృద్ధికి పునాది : మంత్రి దామోదర్ రాజనర్సింహ

by Nallavelli.Anjaneyulu |

ప్రజల ఆరోగ్యం సమాజ అభివృద్ధికి పునాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

ప్రజల ఆరోగ్యమే సమాజ అభివృద్ధికి పునాది : మంత్రి దామోదర్ రాజనర్సింహ
X

దిశ, రవీంద్ర భారతి : ప్రజల ఆరోగ్యం సమాజ అభివృద్ధికి పునాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది చేసిన సేవలను కొనియాడుతూ.. కోవిడ్ సమయంలో వారు చేసిన త్యాగాలను ప్రత్యేకంగా ఆయన గుర్తించారు. మంగళవారం రవీంద్ర భారతిలో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. ప్రజలకు వరల్డ్ హెల్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సంవత్సరం థీమ్ ఆరోగ్య రంగంలో శాస్త్రానికి, సమిష్టి కృషికి ఉన్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్యం అంటే కేవలం వ్యాధులు లేకపోవడం మాత్రమే కాకుండా శారీరక, మానసిక, సామాజికంగా సంపూర్ణ సౌఖ్యం కావాలని మంత్రి స్పష్టం చేశారు.


రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ స్థాయి వరకు ఆరోగ్య సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. జీవనశైలి మార్పులు, కాలుష్యం వంటి కారణాలతో డయాబెటిస్, బీపీ, గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు పెరుగుతున్నాయని, ఇవి ప్రజలపై ఆర్థిక భారం పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్, రిహాబిలిటేటివ్ విధానాలతో సమగ్ర ఆరోగ్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. డయాలిసిస్ సేవలను విస్తరిస్తూ 79 కొత్త కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 109 ట్రామా కేర్ సెంటర్ల ద్వారా అత్యవసర సేవలను బలోపేతం చేస్తున్నామని, ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అంబులెన్స్ సేవలను బలోపేతం చేస్తూ 213 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామని, అత్యవసర స్పందన సమయాన్ని గణనీయంగా తగ్గించినట్లు తెలిపారు. క్యాన్సర్‌ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. క్యాన్సర్ రిజిస్ట్రీ ద్వారా ఖచ్చితమైన డేటాతో మెరుగైన ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఆస్ట్రాజెనెకాతో కలిసి 20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో లంగ్ క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ పైలట్ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Next Story