గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థిని మృతి..!

by Ratna Kumari |

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బీఎస్సీ ఓటీ టెక్నీషియన్ రెండో సంవత్సరం విద్యార్థిని ఎం. పల్లవి గౌడ్ (19) మృతి చెందింది. ఛాతీలో ఫైబ్రో అడెనోమా సమస్యతో ఈ నెల 16న గాంధీ ఆస్పత్రి జనరల్ సర్జరీ విభాగంలో ఆమె చేరినట్లు వైద్యులు తెలిపారు.

గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థిని మృతి..!
X

దిశ, సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బీఎస్సీ ఓటీ టెక్నీషియన్ రెండో సంవత్సరం విద్యార్థిని ఎం. పల్లవి గౌడ్ (19) మృతి చెందింది. ఛాతీలో ఫైబ్రో అడెనోమా సమస్యతో ఈ నెల 16న గాంధీ ఆస్పత్రి జనరల్ సర్జరీ విభాగంలో ఆమె చేరినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల విడుదల చేసిన పత్రిక ప్రకటనలో, శస్త్రచికిత్సకు ముందు నిర్వహించిన అన్ని పరీక్షల్లో ఎలాంటి అసాధారణతలు కనిపించలేదని, అవసరమైన అనుమతులు తీసుకుని ఈ నెల 19న శస్త్రచికిత్స నిర్వహించామని పేర్కొన్నారు. ఆపరేషన్ విజయవంతంగానే పూర్తయిందని వెల్లడించారు. మే 20 ఉదయం డ్రెస్సింగ్ వద్ద స్వల్ప రంగు మార్పు గమనించిన వైద్యులు పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించి, ఉదయం 11 గంటలకు మళ్లీ రీ-ఎక్స్‌ప్లోరేషన్ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు.

శరీరంలో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించి, రక్తస్రావ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తదుపరి పరీక్షల్లో రక్తం గడ్డకట్టే వ్యవస్థలో సమస్యలు ఉన్నట్లు గుర్తించామని, అవసరమైన రక్త ఉత్పత్తులు అందించి పరిస్థితిని స్థిరీకరించేందుకు ప్రయత్నించామని వైద్యులు వివరించారు. అయితే అదే రోజు సాయంత్రం ఆమెకు లోబీపీ, ఊపిరితిత్తుల సమస్యలు, డి-డైమర్ విలువలు పెరగడం వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు. దీంతో డిసెమినేటెడ్ ఇంట్రావాస్క్యులర్ కోగ్యులోపతి (DIC), సెప్సిస్, మల్టీ ఆర్గన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ (MODS) పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. వెంటిలేటర్ సపోర్ట్‌తో పాటు అత్యాధునిక చికిత్స అందించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయామని, శనివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సహ విద్యార్థుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Next Story