హెచ్ ఎండీఏ భూముల కబ్జాకు యత్నం

by Bhanu |

శేరిలింగంపల్లి మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన సర్కార్ భూములు స్వాహా కాగా ఉన్న కాస్త స్థలాలను కాపాడుకోవడంలో కూడా విఫలం అవుతున్నారు.

హెచ్ ఎండీఏ భూముల కబ్జాకు యత్నం
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన సర్కార్ భూములు స్వాహా కాగా ఉన్న కాస్త స్థలాలను కాపాడుకోవడంలో కూడా విఫలం అవుతున్నారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ సర్వే నెంబర్ 100లో 277.5 ఎకరాలు సర్వే నెంబర్ 101 లో 273.34 ఎకరాలు మొత్తం కలిపి 551 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా వీటిపై చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. 2003వ సంవత్సరంలో హైకోర్టు ఈ భూములు ప్రభుత్వానివేనంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ కొందరు ఆ భూములు మావే అంటూ సుప్రీంకోర్టులో దావా వేశారు. ఈభూములపై సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగుతుండగా.. ఈ భూములపై కొన్నాళ్ల క్రితం పేదలు దండయాత్ర చేశారు. ఏకంగా పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో హెచ్ ఎండీఏ అధికారులు కోట్ల రూపాయలు ఖర్చుచేసి కబ్జాలకు గురైన భూములు వదిలేసి ఉన్న స్థలానికి కంచె వేసింది. ఈ స్థలాల రక్షణకు ఓ ఎస్టేట్ ఆఫీసర్ ను, హెచ్ ఎండీఏ తహశీల్దార్ ను, సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించి ఆక్రమణలు చోటుచేసుకోకుండా కాపాడే పనిలో పడింది.

ఇంతమంది ఉన్నా కానీ పట్టపగలే ఫెన్సింగ్ ను తొలగించి సర్వే నెంబర్ 100, 101లో ఉన్న భూముల్లో తిష్టవేసేందుకు యత్నించారు కబ్జాదారులు. శుక్రవారం కొందరు వ్యక్తులు జేసీబీ సహాయంతో సర్వే నెంబర్ 100లో వేసిన ఫెన్సింగ్ ను తొలగించి అక్కడ స్థలాన్ని కబ్జా చేసేందుకు పూనుకున్నారు. కొందరు పక్కనే ఉండి సూచనలు చేస్తుండగా మరికొందరు దగ్గరుండి స్థలాన్ని చదును చేయించారు. అయితే స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే ఆక్రమణదారులు అక్కడి నుండి జేసీబీని పంపివేశారు. ఆలస్యంగా మేల్కొన్న హెచ్ ఎండీఏ అధికారులు విషయం బయటకు పొక్కడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హెచ్ ఎండీఏ ఫెన్సింగ్ తొలగించి కబ్జాలకు యత్నించిన వారిపై మియాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మియాపూర్ పోలీసులు వెంకటేశ్వర రావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

ఆక్రమణదారులపై కేసులు పెట్టాం: హెచ్ ఎండీఏ తహశీల్దార్ దివ్య

మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో భూముల కంచె తొలగించి కబ్జాకు యత్నించిన ఘటనపై హెచ్ ఎండీఏ తహశీల్దార్ దివ్యను వివరణ కోరగా.. ఫెన్సింగ్ తొలగించి, కబ్జాకు యత్నించిన వారిపై మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, కేసు నమోదు అయినట్లు తెలిపారు. అయితే ఒకరిపై కేసు నమోదు చేసి మిగతా వారిపై ఎందుకు కేసు పెట్టలేదు అనేదానిపై తహశీల్దార్ స్పందించలేరు. అలాగే జేసీబీని వదిలివేయడంపై కూడా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు హెచ్ ఎండీఏ అధికారుల సహకారంతోనే ఇదంతా జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Next Story