- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు రైతులను మోసం చేసే కుట్ర జరుగుతోంది: మంత్రి ఉత్తమ్
పాలమూరు రైతులను మోసం చేసే కుట్ర జరుగుతోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: పాలమూరు రైతులను మోసం చేసే కుట్ర జరుగుతోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసని చెప్పారు. కుంగే బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పాలనలో రైతులు బాగుంటే ఓర్వలేకపోతున్నారా అని నిలదీశారు. నిరంతరం రాష్ట్రంలో రైతులను మోసం చేయాలని, రైతులను ఆందోళనకు గురి చేయాలని బీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతోందన్నారు. కుట్రపూరితమైన అబద్ధాలు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. అబద్ధాలను గోబెల్స్‌కు మించి ప్రచారం చేయటం మాజీ మంత్రి హరీష్‌రావుకు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. పంట వేసేటప్పుడు రైతులను ఆదుకునే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ప్రతి పంట సీజన్లో రైతులను ఆందోళనకు గురి చేసి, గందరగోళపరచాలనే దుర్భుద్ధి బీఆర్ఎస్ నేతలదని చెప్పారు. నిరుడు వానాకాలంతో పాటు ఇటీవలి యాసంగిలో భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేశారని తెలిపారు. ఆ విషయాన్ని మరిచిపోయి హరీష్‌రావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. యాసంగి సీజన్‌కు ముందు కూడా బీఆర్ఎస్ ఇలాంటి అబద్ధాలు మాట్లాడిందని చెప్పారు. రైతులోకాన్ని ఆందోళనకు గురి చేయాలని అప్పుడు కూడా కుటిల ప్రయత్నాలు చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
గత వానాకాలంలో రాష్ట్రంలోని రైతులు 66.7 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించిన ఘనత తెలంగాణ రైతులదని తెలిపారు. దేశ చరిత్రలోనే ఒకే ఏడాదిలో 283 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాధించిన రికార్డు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందన్నారు. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిస్తే ఓర్వలేని గుణం బీఆర్ఎస్లీడర్లదన్నారు. పదేండ్లలో తాము చేసిన తప్పులు, దుర్మార్గాలకు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. మేడిగడ్డ, కల్వకుర్తి అంటూ ఇప్పటికీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘బీఆర్ఎస్ అసమర్థత, నిర్లక్ష్యం, నిర్వాకం కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. సీకెంట్ ఫైల్స్ టెక్నాలజీతో మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పు బట్టింది. మేడిగడ్డ మాదిరిగానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అదే సీకెంట్ ఫైల్స్ పౌండేషన్ టెక్నాలజీతో నిర్మించటంతో ప్రమాదకరంగా మారాయి. అవి అక్కరకు రాని పరిస్థితిలోనే ఉన్నాయి.’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.






