భూముల ధరకు రెక్కలు.. అక్కడ ఎకరా రూ.151.25 కోట్లు !

by Javid Pasha |

కారకు రూ.151.25 కోట్లు పలుకడంతో నియో పొలిస్ లేఅవుట్ మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. ఎకరాకు రూ.147.75 కోట్లు పలికింది. హెచ్ఎండీఏకు రూ.1352కోట్ల ఆదాయం సమకూరింది.

భూముల ధరకు రెక్కలు.. అక్కడ ఎకరా రూ.151.25 కోట్లు !
X

దిశ, తెలంగాణ బ్యూరో : హెచ్ఎండీఏకు సంబంధించిన కోకాపేట్ లోని నియోపొలిస్ లేఅవుట్ లోని భూముల ధరలు మండిపోతున్నాయి. 17, 18వ నంబర్ ప్లాట్ల కంటే 15,16 ప్లాట్ల ధరలు రాకెట్ తరహాలో దూసుకెళ్లాయి. ఎకారకు రూ.151.25 కోట్లు పలుకడంతో నియో పొలిస్ లేఅవుట్ మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. మరో ప్లాట్ లోని ఎకరాకు రూ.147.75 కోట్లు పలికింది. ఈ రెండు ప్లాట్ల ద్వారా హెచ్ఎండీఏకు రూ.1352కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు నిర్వహించిన నాలుగు ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.2,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లేఅవుట్ లోని మరో రెండు ప్లాట్లకు డిసెంబర్ 3వ తేదీన వేలం నిర్వహించనున్నారు.

9.06 ఎకరాలకు.. రూ.1352కోట్లు.

కోకాపేట్ లో సుమారు రూ.300 కోట్లకుపైగా ఖర్చుతో 40 ఎకరాలతో కూడిన నియోపొలిస్ లేఅవుట్ ను హెచ్ఎండీఏ డెవలప్ చేసింది. ఈ లేఅవుట్ లో హెచ్ఎండీఏ సకల సౌకర్యాలను కల్పించింది. ఫలితంగానే రికార్డు స్థాయి రేట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఈ లేఅవుట్ లోని ఎకరాకు హెచ్ఎండీఏ రూ.99 కోట్లు ప్రారంభ ధరగా నిర్ణయించింది. 15వ నెంబర్ ప్లాట్ లోని ఎకరాకు రూ.151.25 కోట్లు వెచ్చించి 4.03 ఎకరాలను రూ.609 కోట్లతో జీహెచ్ఆర్ లక్ష్మీ ఇన్ ఫ్రా అర్బన్ బ్లాక్స్ సంస్థ దక్కించుకున్నది. 16వ నెంబర్ ప్లాట్ లోని ఎకరా రూ.147.75 కోట్ల చొప్పున 5.03 ఎకరాలను రూ.743 కోట్లతో గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సంస్థ దక్కించుకున్నది.

కోకాపేట్ లోని నియోపొలిసు లేఅవుట్ లో 15 నుంచి 20 వరకు ఆరు ప్లాట్లకు ఈ-వేలం వేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎకరాకు ప్రారంభ ధర రూ.99 కోట్లు నిర్ణయించారు. అయితే ఈ నెల 24వ తేదీన 17, 18 ప్లాట్లకు వేలం వేశారు. 18వ ప్లాట్ లో ఎకరాకు రూ.137.25కోట్లు వెచ్చించి 5.31ఎకరాలను రూ.728.79కోట్లతో ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్ఎల్పీ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఎకరాకు రూ.136.50 కోట్ల చొప్పున 4.59ఎకరాలను రూ.626.53 కోట్లతో వజ్రా హౌసింగ్ ప్రాజెక్టు ఎల్ఎల్పీ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు ప్లాట్ల ద్వారా హెచ్ఎండీఏకు రూ.1356కోట్ల ఆదాయం వచ్చింది. నాలుగు ప్లాట్ల ద్వారా హెచ్ఎండీఏకు రూ.2,708 కోట్ల ఆదాయం రావడం హర్షనీయమని మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. నియోపొలిస్ లోని ఆరు ప్లాట్లకు గాను ఇప్పటికే నాలుగు ప్లాట్లకు వేలం పాటను పూర్తి చేశారు. మరో రెండు ప్లాట్లతోపాటు కోకాపేట్ లోని గోల్డ్ మైన్ లేఅవుట్ తోపాటు మూసాపేట్ లోని 15 ఎకరాల భూములకు సైతం వేలం నిర్వహించనున్నారు.

Next Story