బల్దియా అధికారులు, సిబ్బందితో కేటీఆర్ ఇంటరాక్షన్..

by Disha Web Desk 6 |
బల్దియా అధికారులు, సిబ్బందితో కేటీఆర్ ఇంటరాక్షన్..
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ పరిధిలో త్వరలో తీసుకురానున్న వార్డు పాలన వ్యవస్థపై మున్సిపల్ మంత్రి కే. తారకరామారావు నేడు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందు కోసం మంత్రి జీహెచ్ఎంసీ ఉద్యోగులతో హైటెక్స్ లో స్పెషల్ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశానికి 2 వేల మందిని తరలించేందుకు నగరంలోని 30 సర్కిళ్ల నుంచి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు.

ఇప్పటికే వార్డు శానిటేషన్ ఆఫీసర్లుగా నియమితులైన 150 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లతో పాటు వార్డు ఇన్ ఛార్జి ఆఫీసర్ గా నియమితులైన మరో 150 మంది సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ కమిషనర్లతో పాటు వార్డుకు 15 మంది చొప్పున మంత్రి ఇంటరాక్షన్ కు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ సెలవు రోజైన రెండో శనివారం ఈ ఇంటరాక్షన్ ను నిర్వహిస్తుండటంతో ఇంటరాక్షన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉద్యోగులు ససే మిరా అంటున్నట్లు సమాచారం. ప్రతి వార్డు శానిటేషన్ ఆఫీసర్, వార్డు ఇన్ ఛార్జి ఆఫీసర్లకు తాము పని చేస్తున్న ఆఫీసుల నుంచి నేరుగా ఫోన్లు చేసి మీటింగ్ కు రావాలని సూచించినా, చాలా మంది సెలవు రోజైనందున తాము రాలేమంటూ తేల్చి చెప్పినట్లు సమాచారం.

ఉదయం ఏడున్నర గంటలకు సర్కిళ్లకు రావాలని, ఆ తర్వాత అక్కడి నుంచి బస్సులో హైటెక్స్ కు వెళ్లనున్నట్లు సిబ్బందికి సమాచారమిచ్చారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి 45 నిమిషాల పాటు రిజిస్ట్రేషన్ ఆ తర్వాత అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ)కి చెందిన ఇద్దరు నిపుణులు వార్డు పరిపాలన అంశంపై శిక్షణనివ్వనున్నట్లు సమాచారం. రెండో శనివారం మంత్రి ఇంటరాక్షన్, ఆదివారం రోజున జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఫ్రీడమ్ రన్ కార్యక్రమాలను నిర్వహించటం పట్ల ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శని, ఆదివారాల్లో నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావాలని ఫోన్లు రాగా, సెలవు రోజుల్లో తామెలా వస్తామని, మీరెలాంటి చర్యలైన తీసుకొండి, సెలవు రోజు వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.

గంట సేపు ఇంటరాక్షన్

పన్నెండున్నర గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు సుమారు గంట సేపు మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు ఉద్యోగులు, విభాగాధిపతులతో ఇంటరాక్షన్ కానున్నారు. ఇందుకు సంబంధించిన వివిధ విభాగాల వారీగా ఇప్పటికే విభాగాధిపతులు ఉద్యోగులను సిద్దం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత వార్డు పరిపాలన అంశంపై మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

అనధికారిక ఆంక్షలు..హెచ్చరికలు

శనివారం హైటెక్స్ లో నిర్వహించనున్న మున్సిపల్ మంత్రి ఇంటరాక్షన్ కార్యక్రమానికి ఇప్పటికే నియమితులైన వార్డు శానిటేషన్ ఆఫీసర్లు, వార్డు ఇన్ ఛార్జి ఆఫీసర్లతో పాటు ఒక్కో వార్డు నుంచి 15 మంది ఉద్యోగులు హాజరు కావాలని, హాజరు కాని వారిపై కఠిన చర్యలుంటాయని ఉద్యోగులను అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. కానీ హాజరయ్యేందుకు సిబ్బంది ససే మిరా అనటంతో అధికారులు ఉద్యోగులు హాజరయ్యేలా వారికి మైండ్ వాష్ చేసేందుకు గురు, శుక్రవారాల్లో గూగుల్ మీటింగ్ లు, డీసీలతో జోనల్ కమిషనర్ల సమీక్షలు, విభాగాధిపతులతో గూగుల్ మీటింగ్ లను నిర్వహిస్తూ మంత్రి ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. సక్సెస్ కాని పక్షంలో మంత్రి నుంచి ఎలాంటి పరిణామాలొస్తాయోనన్న భయం కూడా అధికారులకు పట్టుకుంది.


Next Story

Most Viewed