- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడే జూబ్లీహిల్స్ పోలింగ్
జూబ్లీహిల్స్ బై పోల్ మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగనున్నది. గత ఎన్నికల సరళిని బట్టి నియోజకవర్గంలో 50

బై పోల్‌కు వేళాయే
- నేడే జూబ్లీహిల్స్ పోలింగ్
- ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు..
- సర్వ సిద్ధం చేసిన అధికారులు
- బరిలో 58మంది అభ్యర్థులు
- ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే..
- ఓటర్ చేతిలో నేతల భవితవ్యం
- 14న కౌంటింగ్.. ఫలితం
దిశ , హైదరాబాద్ బ్యూరో: జూబ్లీహిల్స్ బై పోల్‌కు వేళయ్యింది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. మంగళవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల కోసం అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కాగా.. అక్టోబర్ 21 నామినేషన్లకు దాఖలుకు తుదిగడువు విధించారు. కాగా, అక్టోబర్ 22న నామినేషన్ల ప్రక్రియ, 24వ తేదీన ఉప సంహరణకు చివరి తేదీకాగా, నవంబర్ 11 పోలింగ్ నిర్వహిస్తున్నారు. 14న కౌంటింగ్, అదేరోజు ఫలితం ప్రకటనతో ఎన్నికల కోడ్ ముగియనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ బైపోల్‌లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే నడిచింది.
హోరాహోరీగా ప్రచారం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పలు కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలు చేపట్టారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర నాయకులు అన్నీ తామై ప్రచారం చేసినా పెద్దగా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. ఇక్కడ బీజేపీ పోటీ నామమాత్రమేననే ప్రచారం జరుగుతుండగా.. అభ్యర్థికి డిపాజిట్ దక్కేది కూడా సందేహంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు ప్రచారంతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్..
జూబ్లీహిల్స్ బై పోల్ మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగనున్నది. గత ఎన్నికల సరళిని బట్టి నియోజకవర్గంలో 50 నుంచి 60 శాతం ఓటింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో 4,01,365 మంది ఓటర్లు నమోదై ఉండగా.. వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంల ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, సామగ్రి పంపిణీ చేయడంతో వారికి కేటాయించిన పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు. మొత్తం ఈ పోలింగ్‌లో విధుల్లో 5వేల మంది పోలీసులతో బందోబస్తు చేపడుతున్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలుండగా.. వీటిల్లో 65 సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించి బందోబస్తును పటిష్టం చేశారు. నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 230 మంది రౌడీ షీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు.
ఓటరు చేతిలో నేతల భవితవ్యం..
జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌కు జరుగుతున్న బై పోల్ చివరి దశకు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలు, ఉప సంహరణ, ప్రచారం గడువులు ముగిశాయి. కేవలం పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఎంత మేర పోలింగ్ శాతం నమోదవుతుంది? ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు? అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 14వ తేదీన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగే కౌంటింగ్‌లో నాయకుల భవితవ్యం తేలనుంది. ఇదిలాఉండగా.. ఎవరు గెలుస్తారనే విషయంలో నగరంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ లు జరుగుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద మరో మూడు రోజుల్లో జూబ్లీహిల్స్ సీటు ఏ పార్టీ ఖాతాలో చేరనుందనేది స్పష్టం కానున్నది.






