ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్ పోలింగ్...ఫైన‌ల్ ప‌ర్సంటేజ్ ఎంతంటే

by velandi.Saikiran |

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకే ఓటింగ్ మొదలైనప్పటికీ

ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్ పోలింగ్...ఫైన‌ల్ ప‌ర్సంటేజ్ ఎంతంటే
X

- ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

- చెదురు మదురు ఘటనలు మినహా బై పోల్ ప్రశాంతం

- 14న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు

- 11 చోట్ల ఈవీఎంల మొరాయింపు

దిశ, హైదరాబాద్ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకే ఓటింగ్ మొదలైనప్పటికీ మందకొడిగా సాగింది. యువత ఓటేసేందుకు ముందుకు రాకపోవడంతో చాలా చోట్ల ఓటర్లు లేక పోలింగ్ బూత్‌లు వెలవెలబోయాయి. 11 చోట్లా ఈవీఎంలు పని చేయక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటల వరకు కేవలం 10.2 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం, మూడింటి వరకు 40.20 శాతం, 5 గంటల వరకు 47.16 శాతం, మొత్తం పోలింగ్ 48.42 శాతం నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పట్టిష్టమైన చర్యలు తీసకున్నప్పటికీ చెదురు మదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా.. ఈ నెల 14న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగనుంది.

ఎన్నికల కమిషన్‌కు పరస్పర ఫిర్యాదులు..

ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించగా.. బీఆర్ఎస్ అభ్యర్థి సైతం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్‌లో తిరగాల్సిన అవసరమేమిటని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఓటర్లు నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని, వారికి తాను, పార్టీ అండగా ఉంటామన్నారు. ఓటుకు నోటు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

మొరాయించిన ఈవీఎంలు..

జూబ్లీహిల్స్ లోని ఏడు డివిజన్లలో మంగళవారం జరిగిన పోలింగ్ ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టినట్లయింది. ఓ వైపు అత్యల్ప ఓటింగ్ నమోదై పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు మందకొడిగా ఉన్నప్పటికీ 11 చోట్లా ఈవీఎంలు పని చేయక ఇబ్బందుల పాలయ్యారు. పని చేసిన చోట కూడా ఈఎవీఎంలో ఓటు నమోదు కావడానికి సుమారు పది సెకన్లకు పైగా సమయం తీసుకోవడంతో ఓటు నమోదైందో లేదో తెలియక తికమకకు గురయ్యారు. దీంతో పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. కొన్ని చోట్ల అధికారులు వేగంగా స్పందించి మొరాయించిన ఈవీఎంలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర సెలబ్రిటీలు తమ ఓటు హక్కును ఉదయమే వినియోగించుకొని పలువురికి ఆదర్శంగా నిలిచారు.

మొదటి సారిగా అభ్యర్థుల కలర్ ఫొటోలు..

గతంలో బ్లాక్ అండ్ వైట్ ఉండగా.. ఈసారి మొదటి సారిగా కలర్ ఫొటోలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా ఓటర్లకు ఓటు వేసే సమయంలో సందేహాలు తీర్చేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఫోన్ డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దేశంలోనే ప్రథమంగా ఈ ఎన్నికల్లో డ్రోన్ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం 139 లొకేషన్లలో డ్రోన్‌లు ఏర్పాటు చేసి వాటిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో ఏ ఎన్నికలు జరిగినా సాయంత్రం ఐదు గంటల వరకే ఓటింగ్ ప్రక్రియ ముగిసేది. ఈ సారి మాత్రం మొదటిసారిగా 6 గంటల వరకు పెంచారు. అయితే 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారిని ఓటేసేందుకు అనుమతిచ్చారు. ఈ గంటలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది చర్చనీయాంశంగా మారింది.

ఓ వైపు ఓటింగ్.. మరోవైపు ప్రచారం?

ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మంత్రి సీతక్క అనుచరుడు పైడాకుల అశోక్ బోరబండ డివిజన్‌లో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా మరోవైపు ప్రచారం నిర్వహించారు. ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని ఆపి వారితో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ఒట్టు వేయించుకున్నారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీసింది.

దొంగ ఓట్ల కలకలం..

జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ డివిజన్ లోని 67వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓ మహిళ ఓటు వేసేందుకు రాగా అప్పటికే ఆమె ఓటు గుర్తు తెలియని వ్యక్తులు వేసి వెళ్లిపోయారు. తర్వాత ఓటు వేసేందుకు వచ్చిన మహిళను అధికారులు అడ్డుకున్నారు. దీంతో సదరు మహిళ వారితో వాగ్వాదానికి దిగింది. తన ఓటు ఇతరులు ఎలా వేశారని ఆమె ప్రశ్నించారు. అయితే దొంగ ఓట్లపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని అధికారులు చెప్పారు.

షేక్ పేట్‌లో ఎంఐఎం గూండాగిరి..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం పార్టీ నేతలు రెచ్చిపోయారు. పోలింగ్ ఏజెంట్లను, అధికారులు, సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారు. షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని డైమండ్ హిల్స్, అజీజ్ బాగ్, పారామౌంట్ కాలనీ, సమతా కాలనీ తదితర చోట్ల పోలింగ్ బూత్ ల వద్ద వారు రౌడీయిజం ప్రదర్శించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్‌తో పాటు అనుచరులు అక్కడికి చేరుకొని గూండాగిరి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, సిబ్బందితో పాటు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి రిగ్గింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తున్నది. బూత్ లలో పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపి ఓటర్ ఐడీ కార్డులు లేకున్నా ఓట్లు వేసినా అక్కడున్న వారు నోరు మెదపని పరిస్థితి నెలకొంది. ఎంఐఎం నాయకుల తీరుపై స్థానికంగా ఓటర్లు మండిపడుతున్నారు. షేక్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు స్వస్తిక్‌పై దాడి జరిగింది. దీంతో ఆయన ఫిల్మ్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజు బీజేపీ నాయకులు బయట తిరగరాదని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఎన్నికలు రద్ధు చేయాలి : మాగంటి సునీత

కృష్ణానగర్‌లోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. జూబ్లీహిల్స్ బై పోల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, కాంగ్రెస్ లీడర్లు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులతో వాదనలకు దిగడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మాగంటి సునీత డిమాండ్ చేశారు. రిగ్గింగ్ జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ధ్వజమెత్తారు. ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసుల లాఠీ చార్జ్..

షేక్ పేట్ డివిజన్ బృందావన్ కాలనీ బూత్ నెంబర్ 4,5,6,7,8 వద్ద లాఠీ చార్జ్ చేశారు. అపెక్స్ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లు 40,41,42 బూత్ లలో రిగ్గింగ్ జరుగుతున్నదని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా పోటాపోటీగా నినాదాలు చేయడంతో వారిని చెదరగొట్టడంలో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను మోహరించి బందోబస్తు పటిష్టం చేశారు.

Next Story