నో గ్యాస్.. శ్మశానవాటికలపై సైతం ప్రభావం

by velandi.Saikiran |   (  Updated:2026-03-12 22:46:09  IST  )

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావంతో నగరంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గిపోవడం ప్రజలను కలవరపెడుతోంది.

నో గ్యాస్.. శ్మశానవాటికలపై సైతం ప్రభావం
X

నో గ్యాస్.. కట్టెలకు డిమాండ్

రేట్లు పెంచేసిన టింబర్ డిపోలు

ఫంక్షన్ హాళ్లలో తగ్గిన మెనూ

శ్మశానవాటికలపై సైతం ప్రభావం

దిశ, హైదరాబాద్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావంతో నగరంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గిపోవడం ప్రజలను కలవరపెడుతోంది. ముఖ్యంగా వ్యాపారులను ఆందోళనలకు గురిచేస్తోంది. రెండు, మూడు రోజుల నుంచి గ్యాస్ లభ్యత కష్టంగా మారిన నేపథ్యంలో గ్యాస్ డీలర్లు తమ వద్ద ఉన్న రిజర్వు స్టాక్‌ను అందరికీ సమానంగా పంచుతున్నప్పటికీ అది ఏమాత్రం సరిపోవడం లేదు. గతంలో కమర్షియల్ సిలిండర్లు కావాలా అని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులే అడిగేవారని, ఇప్పుడు పరిస్థితులు తలకిందులు కావడంతో గ్యాస్ సరఫరా తగ్గిపోయి నిర్వహణ భారంగా మారుతోందని హోటల్, హాస్టల్ నిర్వాహకులు వాపోతున్నారు. నగరంలో గ్యాస్ దొరక్కపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఓయూ క్యాంపస్ పరిధిలో చెట్లను వంట చెరుకు కోసం గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి దొంగిలిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇది తమ దృష్టికి రాలేదని ఓయూ అధికారులు చెబుతున్నారు.

కట్టెలకు డిమాండ్

నగరంలో గ్యాస్ కొరత కారణంగా చాలా వరకూ హోటళ్లు, హాస్టల్స్, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు కట్టెల వైపు దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా కట్టెలకు డిమాండ్ ఏర్పడింది. టింబర్ డిపోల దగ్గర కట్టెల కోసం బారులు తీరి కనబడుతున్నారు. దీంతో కట్టెల మండి నిర్వాహకులు ధరలు అమాంతం పెంచేశారు. గ్యాస్ కొరత ఏర్పడక ముందు వరకు క్వింటాలు కట్టెలు రూ.1000 నుండి రూ.1200 వరకు ఉండగా వీటి ధరలు ఇప్పుడు రెట్టింపయ్యాయి. సుమారు క్వింటాలు కట్టెలు రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఫంక్షన్ హాళ్లపై తీవ్ర ప్రభావం

ప్రస్తుతం వివాహాల సీజన్ కావడంతో గ్యాస్ కొరత ఫంక్షన్ హాల్ నిర్వాహకులపై నేరుగా పడింది. పెళ్లీళ్లకు ముందుగానే ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోగా ఇప్పుడు గ్యాస్ సరఫరా లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తుండగా వంటలు చేసేవారు కట్టెల పొయ్యిపై వంట చేసేందుకు ససేమిరా అంటూ అధిక మొత్తం డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మెనూను సైతం తగ్గిస్తున్నారు. మరోవైపు క్యాటరింగ్ నిర్వాహకులు సైతం అమాంతం రేట్లు పెంచేశారు.

శ్మశానవాటికలకు తగ్గిన గ్యాస్ సరఫరా

నగరంలోని గ్యాస్ ఆధారిత శ్మశానవాటికలలోనూ కష్టాలు మొదలయ్యాయి. సిటీలోని బేగంపేట, బోయిన్‌పల్లి, బోరబండ, పటాన్ చెరువులలో గ్యాస్ ఆధారిత దహనవాటికలు ఉన్నాయి. ప్రతిరోజు వీటిల్లో పదుల సంఖ్యలో దహనాలు జరుగుతుంటాయి. అయితే, గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాటికాపర్లు చెబుతున్నారు. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా కట్టెలు వాడే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చు పెరుగుతోందని పేర్కొంటున్నారు. మొత్తం మీద గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో అన్ని రంగాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Next Story