- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు బకాయిల బాదుడు!
ఫీజు బకాయిల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఫీజు బకాయిల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని యాజమాన్యాలు తెగేసి చెబుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు. హాల్‌టికెట్లను కాలేజీ లాగిన్‌లలో మాత్రమే ఓపెన్ అవుతుండడంతో కాలేజ్‌ల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇచ్చేందుకు ఫీజులకు ముడిపెడుతున్నాయి. బోర్డు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచామని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు చెబుతున్నప్పటికీ వాటిల్లో యాక్సిస్ చూపించడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజ్‌ల యాజమాన్యాలను కలిసి త్వరలో చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. ఈ నెల 25వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం, 26న రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాల్ టికెట్ల కోసం ఓ వైపు విద్యార్థులకు, మరోవైపు వారి తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.
అటెండెన్స్ లేదంటూ..
ఇంటరీ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వీలైనంత ఎక్కువ దోపిడీ చేసేందుకు కొన్ని జూనియర్ కాలేజ్‌లు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాలేజ్ ఫీజుల చెల్లింపు మాత్రమే కాకుండా హాజరు శాతం తక్కువగా ఉందని, ఇందుకు కూడా ఫీజులు చెల్లించాలని జులుం చేస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన వారిని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాయి . ఎట్టిపరిస్థితుల్లో ఫీజులన్నీ చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్ సమర్పిస్తేనే హాల్ టికెట్ల జారీ ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్‌లు సైతం పెడుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఫీజుల కోసం హాల్‌టికెట్లను నిలిపివేయడం చట్టవిరుద్ధమని కోర్టులు పేర్కొన్నప్పటికీ కాలేజీలు పట్టించుకోవడం లేదు. పరీక్షలకు సమయం తక్కువ ఉండడం, మరోమారు కోర్టును ఆశ్రయించడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో కాలేజీల డిమాండ్లకు తలొగ్గి అప్పుల కోసం పరుగులు పెడుతున్నారు.
తప్పులు సరిచేసుకోవడం ఎలా..?
తెలంగాణలో ఇంటర్ హాల్ టికెట్లను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ విడుదల చేసింది. అయితే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఓపెన్ కాకుండా పోవడంతో వారు కాలేజీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఫీజులకు ముడిపెడుతున్నారు. ఒకవేళ హాల్ టికెట్లపై ఏమైనా తప్పులుంటే సరిదిద్ధుకోవడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అవకాశం ఇచ్చింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. తప్పు, ఒప్పులు సరి చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తప్పులను కాలేజీల ప్రిన్సిపాల్స్ దృష్టికి తీసుకెళ్లి సవరించుకోవాలి. అయితే హాల్ టికెట్లే ఇవ్వకపోవడంతో తప్పులు చూసుకోవడం ఎలా అనేది అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. విద్యార్థులు నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్‌కు ఇంటర్ బోర్డు మెసేజ్ ద్వారా లింకును పంపి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు.
ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలి..
ఫీజులతో సంబంధం లేకుండా కాలేజీల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలు ముగిసి ఫలితాలు వెలువడి మెమో, టీసీ, స్టడీ, బోనాఫైడ్ తదితర సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలోగా ఫీజులు చెల్లిస్తామని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్ దృష్ట్యా అధికారులు, కాలేజ్ యాజమాన్యాలు మానవతాదృక్పథంతో వ్యవహరించి హాల్ టికెట్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు.






