బైరామ‌ల్ గూడ అర్థ‌రాత్రి అక్ర‌మ డ్రైనేజీ త్ర‌వ్వ‌కాలు

by Ratna Kumari |

ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని బైరామ‌ల్ గూడ డివిజ‌న్ లో జ‌డ్పీ రోడ్డు ప్ర‌ధాన ర‌హ‌దారి పై ఎలాంటి అధికార అనుమ‌తులు లేకుండానే అర్థ‌రాత్రి అక్ర‌మంగా డ్రైనేజీ క‌నెక్ష‌న్ ప‌నులు చేప‌ట్ట‌డం తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.

బైరామ‌ల్ గూడ అర్థ‌రాత్రి అక్ర‌మ డ్రైనేజీ త్ర‌వ్వ‌కాలు
X

దిశ‌, హ‌స్తినాపురం : ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని బైరామ‌ల్ గూడ డివిజ‌న్ లో జ‌డ్పీ రోడ్డు ప్ర‌ధాన ర‌హ‌దారి పై ఎలాంటి అధికార అనుమ‌తులు లేకుండానే అర్థ‌రాత్రి అక్ర‌మంగా డ్రైనేజీ క‌నెక్ష‌న్ ప‌నులు చేప‌ట్ట‌డం తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. స్థానికుల క‌థ‌నం ప్ర‌కారం.. జ‌డ్పీరోడ్డులో ఉన్న ల‌క్కీ స్ట్రీట్ హోట‌ల్ యాజ‌మాన్యం త‌మ హోట‌ల్ కి డ్రైనేజీ క‌నెక్ష‌న్ ఇప్పించుకునేందుకు ప్ర‌భుత్వ అనుమ‌తులు లేకుండానే ర‌హ‌దారిని త‌వ్వించి పైపు లైన్, మ్యాన్ హోల్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల సౌక‌ర్యాల‌ను పట్టించుకోకుండా రాత్రి వేళల్లో పనులు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.


ఇప్పటికే ఈ ప్రధాన రహదారి పై ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైన నేపథ్యంలో అక్రమ తవ్వకాల కారణంగా వాహనదారులు, కాలనీవాసులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు తవ్వకం, విషయంపై మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) డీజీఎం రావుల శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. ఈ తవ్వకాలకు తమ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అక్రమ పనులను వెంటనే నిలిపివేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి అనధికార తవ్వకాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బైరమల్‌గూడ, హస్తినాపురం పరిసర బస్తీల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story