చెరువుల పూర్వవైభవానికి హైడ్రా చర్యలు.. బుమృకుద్దౌలాపై ఫోకస్

by Malleboina Mahesh |

చెరువుల ఆక్రమణలు, కబ్జాలపై ఫోకస్ పెట్టి వాటిని తొలగించడమే కాకుండా.. పునరుద్ధరించే బాధ్యతలను సైతం హైడ్రా తీసుకున్నది.

చెరువుల పూర్వవైభవానికి హైడ్రా చర్యలు.. బుమృకుద్దౌలాపై ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువుల ఆక్రమణలు, కబ్జాలపై ఫోకస్ పెట్టి వాటిని తొలగించడమే కాకుండా.. పునరుద్ధరించే బాధ్యతలను సైతం హైడ్రా తీసుకున్నది. చెరువుల గుర్తింపు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించడానికి ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్లు జారీ చేయడానికి సైతం కసరత్తు చేస్తున్నది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులపై ఫోకస్ పెట్టింది. అందుకే బతుకమ్మకుంటనే సజీవ సాక్ష్యం. రూ.58.50 కోట్లతో ఆరు చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించిన హైడ్రా.. ఒక్కొక్కటిగా చెరువులను పునరుద్ధరిస్తుంది. ఇప్పటికే బతుకమ్మకుంట ను ప్రారంభించింది.

ప్రస్తుతం బుమృకుద్దౌలా, తర్వాత కూకట్ పల్లి నల్లచెరువు, మాదాపూర్ లోని తుమ్మిడి కుంట చెరువులను పునరుద్ధరించాలని హైడ్రా నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించే ప్రజాపాలన దినోత్సవాల్లో మూడు చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చి ప్రజలకు అంకితమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు.

బతుకమ్మకుంటను బతికించి..

అంబ‌ర్‌పేట మండ‌లం బాగ్అంబ‌ర్‌పేట్‌లోని స‌ర్వే నంబ‌రు 563లో 1962-63 లెక్కల ప్రకారం 14.06 ఎక‌రాల విస్తీర్ణంలో బ‌తుక‌మ్మకుంట‌, బ‌ఫ‌ర్ జోన్‌తో క‌లిపి మొత్తం 16.13 ఎక‌రాల వైశాల్యం అని సర్వే అధికారులు తేల్చారు. తాజా స‌ర్వే ప్రకారం అక్కడ 5.15 ఎక‌రాల విస్తీర్ణం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎక‌రాల విస్తీర్ణంలోనే బ‌తుక‌మ్మ కుంట‌ను పునరుద్ధరించింది. మండు వేస‌విలో దాదాపు రూ. 7.15 కోట్లతో బ‌తుక‌మ్మకుంట ప‌నుల‌ను హైడ్రా చేప‌ట్టింది. జేసీబీల‌తో మోకాలులోతు తవ్వగానే గంగ‌మ్మ త‌ల్లి ఉబికివ‌చ్చింది. బ‌తుక‌మ్మ కుంట బ‌తికే ఉంద‌ని రుజువు చేసింది

నేడు బుమృకుద్దౌలా.

బుమృకుద్దౌలా చెరువు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 18 ఎక‌రాల‌కుపైగా ఉన్న ఈ చెరువు కేవ‌లం 4.12 ఎక‌రాల‌కు ప‌రిమిత‌మైపోగా.. ఆక్రమణలను తొల‌గించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు చెరువును 18 ఎక‌రాల మేర విస్తరించి.. వ‌ర‌ద కట్టడితోపాటు.. భూగ‌ర్భ జ‌లాలు స‌మృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. చెరువులోకి వ‌ర‌ద నీరు చేరేలా.. నిండితే పోయేలా నిర్మించిన ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్లను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. ఎంతో చ‌రిత్ర కలిగిన ఈ చెరువు మ‌ళ్లీ పునరుద్ధరణకు నోచుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ప‌లువురు సంబ‌ర ప‌డుతున్నారు.

చెరువు చుట్టూ..

చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు నిర్మిస్తున్నారు. అలాగే చెరువుక‌ట్ట చుట్టూ ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు. అలాగే చెరువు లోప‌లి వైపు కూడా ఎవ‌రూ లోనికి వెళ్లకుండా.. గ‌ట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలు, అలాగే వృద్ధులు సేద దీరే విధంగా అక్కడ సీటింగ్ ఏర్పాటు చేయ‌డంతోపాటు పార్కులు నిర్మిస్తున్నారు. ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు చుట్టూ ర‌హ‌దారులు నిర్మించ‌డంతో పాటు.. గ్రీన‌రీని పెంచే విధంగా మొక్కలు నాటుతున్నారు. ప‌చ్చిక బయళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే న‌గిషీలు చెక్కుతున్నారు. నిజాంల కాలంలో రాతితో నిర్మించిన బండ్‌ను చెక్కు చెద‌ర‌కుండా కాపాడుతూ.. మ‌రింత ప‌టిష్టం చేస్తున్నారు. చెరువులో కూడా మ‌ట్టిలో క‌లిసిపోయిన నాటి రాళ్లను బ‌య‌ట‌కు తీసి భద్రపరుస్తున్నారు. ఔట్‌లెట్‌కు మ‌ళ్లీ గేట్లు బిగిస్తున్నారు. స్థానిక నివాసితులు అక్కడకు వ‌చ్చి సేద‌దీరేవిధంగా రూపొందించ‌డ‌మే కాకుండా.. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను ప‌టిష్టం చేస్తున్నారు.

అడ్డుంకులను అధిగమిస్తూ..

ఓల్డ్ సిటీలోని బుమృకుద్దౌలా చెరువు విషయంలోనూ స్థానికుల్లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఈ భూములను కొనుగోలు చేశామని, దీనివల్ల తాము నష్టాపోవాల్సి వస్తుందని హైడ్రాను ఆశ్రయించారు. వారితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమై నచ్చజెప్పారు. అర్హత ఉన్నవారికి ప్రభుత్వంతో మాట్లాడి పరిహారం కింద ట్రాన్స్ ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక కూకట్ పల్లి నల్ల చెరువు వద్ద కూడా కూల్చివేతల సమయంలో ఎంతోమంది వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పనులను చూసి స్థానికులే హైడ్రాను అభినందిస్తున్నారు. అలాగే తమ్మిడికుంట వద్ద కూడా కొందరు అక్రమంగా వ్యాపారాలు చేస్తూ హైడ్రాను అడ్డుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించిన అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఇలా ఒక్కో దగ్గర ఒక్కో విధమైన అడ్డంకులు ఎదురయ్యాయి.

185 చెరువులు సైతం హైడ్రాకే..

జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 185 చెరువులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. మిగిలిన చెరువుల పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నది. అందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సైతం అంగీకరించినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం హైడ్రా పునరుద్ధరిస్తున్న ఆరు చెరువులు సైతం జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం విశేషం.

నవంబర్ చివరి నాటి పూర్తి చేస్తాం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవాల్లోగా బుమృకుద్దౌలా, కూకట్ పల్లి నల్లచెరువు, మాదాపూర్ లోని తమ్మిడికుంట చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తాం. ఈ మూడు చెరువులకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వీటిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. తర్వాత ఉప్పల్ నల్ల చెరువు, సున్నం చెరువులను సైతం పునరుద్ధరిస్తాం. :- రంగనాథ్, హైడ్రా కమిషనర్

Next Story