మెహదీపట్నంలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం

by Ratna Kumari |

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ జోన్ బృందం) మెహదీపట్నం పోలీసులు అత్యంత సమన్వయంతో పక్కా సమాచారం ఆధారంగా ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు.

మెహదీపట్నంలో భారీగా ఎండీఎంఏ  డ్రగ్స్ స్వాధీనం
X

దిశ, కార్వాన్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ జోన్ బృందం) మెహదీపట్నం పోలీసులు అత్యంత సమన్వయంతో పక్కా సమాచారం ఆధారంగా ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పరిమాణంలో మత్తుపదార్థమైన ఎండీఎంఏ విక్రయిస్తున్న ప్రధాన డ్రగ్ పెడ్లర్, ముగ్గురు సబ్-పెడ్లర్లు లతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురు వినియోగదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్ గిరి నగర్ ప్రాంతానికి చెందిన ఎమ్. శుభమ్ కుమార్ మిశ్రా(19), బాలానగర్ గురుమూర్తి నగర్ ప్రాంతానికి చెందిన సోహమ్ నాయక్అలియాస్ జిత్తు (19) జొమాటో డెలివరీ బాయ్. కలంగి రాజేష్ (28) మొబైల్ టెక్నీషియన్. గాంధీనగర్ గిరి నగర్ ప్రాంతానికి చెందిన ముంతున్ కుమార్ మిశ్రా ( 22) రాపిడో బైక్ రైడర్.


మాసబ్ ట్యాంక్ విజయనగర్ కాలనీ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్రార్ అల్జమా ( 26), మల్లేపల్లిలో ఆటోరిక్షా విడిభాగాల వ్యాపారం, బార్కస్ బాబా నగర్ ప్రాంతానికి చెందిన రషీద్ బిన్ హుస్సేన్ (28), రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఖాజా జోహైబుద్దీన్ ( 27), వ్యాపారీ, బాలానగర్ కు చెందిన అబ్దుల్ షాబాజ్ (24), మీరందరూ కలిసి గత కొంతకాలంగా డ్రగ్స్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప‌క్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి వీరి వద్ద డ్రగ్స్ ఇతర సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏ మత్తు పదార్థం: 137.60 గ్రాములు, వోల్వో కారు నెం. టీ ఎస్ 07 జీ పీ 0135 చిన్న ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్, సుత్తి, రబ్బర్ బ్యాండ్ల ప్యాకెట్, కాంప్లిమెంట్ కవర్ల ప్యాకెట్, ప్యాకింగ్ కవర్లు 09 మొబైల్ ఫోన్లు, మొత్తం ఆస్తి విలువ: రూ. 26,80,500/- ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల్లో శుభమ్ కుమార్ మిశ్రా, సోహమ్ నాయక్, కలంగి రాజేష్, ముంతున్ కుమార్, అబ్దుల్ షాబాజ్ బాలానగర్ ప్రాంతానికి చెందినవారు కాగా, మిగిలిన వినియోగదారులు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ప్రధాన నిందితుడైన శుభమ్ కుమార్ మిశ్రాకు అదే ప్రాంతంలో నివసించే బుసా సాయి నిఖిల్ యాదవ్ అలియాస్ సాయి చిన్ననాటి స్నేహితుడు. వీరిద్దరికీ అలవాటుగా గంజాయి, ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉంది. ఈ క్రమంలో శుభమ్ తన సొంత వినియోగానికి, ఇతరులకు విక్రయించడానికి సాయి నిఖిల్ వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ను సేకరించడం ప్రారంభించాడు.

సాయి నిఖిల్‌ను ఇటీవల చిలకలగూడ పోలీసులు డ్రగ్స్ కేసులో గత కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. సాయి నిఖిల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా శుభమ్ కుమార్ మిశ్రా ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని ఆపకుండా తన స్నేహితులైన సోహమ్ నాయక్, కలంగి రాజేష్ లతో కలిసి కొనసాగించాడు. శుభమ్ వారిద్దరికీ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేయగా.. వారు దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు విక్రయించేవారు. ఈ డ్రగ్స్‌ను వినియోగదారులకు చేరవేయడానికి శుభమ్ స్వయంగా వెళ్లడమే కాకుండా, రాపిడో సర్వీసులను ఉపయోగించేవాడు. అలాగే తన అన్న ముంతున్ కుమార్ ద్వారా కూడా డ్రగ్స్ డెలివరీ చేయించేవాడు. నమ్మదగిన సమాచారం మేరకు గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్, మెహదీపట్నం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులపై మెహదీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిటీ పోలీస్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, పర్యవేక్షణలో, గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్. వెంకటేష్, మెహదీపట్నం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. మల్లేష్, సబ్-ఇన్‌స్పెక్టర్లు జి. విజయానంద్, జి.వి. నరసింగరావు సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొని నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Next Story