ఇంకెన్ని స్వప్నలోక్‌లో..?

by Disha Web Desk 12 |
ఇంకెన్ని స్వప్నలోక్‌లో..?
X

దిశ, సిటీబ్యూరో: మహానగరంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడల్లా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతామంటూ పాలకులు, అధికారులు చేస్తున్న ప్రకటనలు ఏ మాత్రం అమలుకావడం లేదు. ఇది ప్రజల పాలిట ప్రాణ సంకటంగా మారిందన్న విమర్శలున్నాయి. ఏడాది క్రితం బోయిగూడ లోని గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవదహనం, మొన్న వైఎంసీఏ వద్దనున్న బైక్‌ల బ్యాటరీల గోదాంలో తొమ్మిది మంది, నిన్న దక్కన్ ప్లాజాలో ముగ్గురు, తాజాగా స్వప్నలోక్‌లో ఆరుగురి జీవితాలు కాలిబూడిదయ్యాయి.

అసలే ఎండాకాలం, మున్ముందు ఎండలు బాగా దంచికొట్టనున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం లోడ్ పెరిగి పాతకాలం వైరింగ్‌లలో షార్ట్ సర్క్యూట్‌లు ఏర్పడి స్వప్నలోక్ కాంప్లెక్స్ మాదిరిగా ఇంకెన్నీ భవనాల్లో ప్రమాదాలు జరుగుతుయోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ లేని ఇలాంటి భవనాల్లోని చిన్న చిన్న ఆఫీసులు, సక్రమంగా పని చేయని లిఫ్టులు వంటి అరకొర వసతుల మధ్య పొట్టకూటి కోసం విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు ఉద్యోగుల్లో స్వప్నలోక్ ఘటనతో భయం మరింత రెట్టింపయింది.

ప్రాణాల విలువ పరిహారమా?

గడిచిన ఏడాదిన్నరలో ఆరేడు అగ్ని ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో అమాయకులు అగ్నికి ఆహుతి అయిన పాలకులు, అధికారులు కనీసం శాశ్వత నివారణ చర్యలు చేపట్టడం లేదంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన వారికి ప్రాణాలకు వెలకట్టి నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుందని పాలకులు భావిస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహానగరంలో నిర్మితమవుతున్న బహుళ అంతస్తుల కమర్షియల్ భవనాల్లో గడిచిన అయిదారేళ్ల నుంచి మాత్రమే నిర్మాణ సమయంలో ప్రొవిజినల్ ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ తీసుకుంటున్నారే తప్పా, భవనం పూర్తిస్థాయిలో నిర్మితమైన తర్వాత ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు ఏర్పాటు చేసుకోకపోయినా, ఎన్ఓసీలు రావడం వల్లే, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం భారీగా జరుగుతుందన్న వాదనలున్నాయి.

తాజాగా అగ్నిప్రమాదం సంభవించిన సికింద్రాబాద్‌లోని స్సప్నలోక్ కాంప్లెక్స్ సుమారు 45 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం. కొత్తలో వీటిలో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేసినా, ఆ తర్వాత ఒక్కసారి కూడా అగ్నిమాపక శాఖ గానీ, జీహెచ్ఎంసీ గానీ తనిఖీలు చేసిన పాపన పోలేదు. పైగా ప్రమాదం జరిగిన రోజున కూడా ఈ భవనంలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలున్నాయంటూ ఈవీడీఎం సమర్దించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంత భారీ అగ్నిప్రమాదం జరిగినా, అందులో చిక్కుకున్న వారిని కాపాడాలన్నదే ఫైర్ సేఫ్టీ మొట్టమొదటి ఉద్దేశ్యం. కానీ ఆ ఉద్దేశ్యాన్ని ఉత్తుత్తి చేసి, అడ్డదారిలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తూ జీహెచ్ఎంసీ ఈవీడీఎం పరోక్షంగా ప్రాణాలు పోయేందుకు కారణమవుతుందన్న వాదనలున్నాయి.

పాతకాలపు భవనాలే ఎక్కువ

ప్రస్తుతం మహానగరంలో కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగుతున్న బహుళ అంతస్తు భవనాల్లో ఎక్కువ శాతం పాత కాలానికి చెందినవే. వీటిలో చాలా భవనాలు రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని, కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నవే ఉన్నాయి. రెసిడెన్షియల్ అయితే అందులోని ఫ్లాట్లను అమ్ముకుని, అద్దెకిచ్చిన వచ్చే ఆదాయం కన్నా ఐదు రేట్లు ఎక్కువగా కమర్షియల్‌కు ఇస్తే వస్తుండటంతో భవన నిర్మాణ యజమానులంతా రెసిడెన్షియల్ భవనాలన్నీ కమర్షియల్ కిందకు మార్చేసినట్లు సమాచారం. రెసిడెన్షియల్ బహుళ అంతస్తు భవనాలకైతే అయిదంతస్తులకు మంచి ఎక్కువ అంతస్తులుంటేనే ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరి అన్న నిబంధన ఉంది. జీహెచ్ఎంసీ రికార్డుల్లో రెసిడెన్షియల్ భవనాలుగా పేర్కొన్న భవనాల్లో నేడు లక్షల భవనాలు కమర్షియల్‌గా వినియోగిస్తున్నా, గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఎన్నో ప్రమాదాలు జరిగి వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

నాటి రెసిడెన్షియల్ భవనాల్లో ఎక్కువశాతం ప్రస్తుతం కమర్షియల్ భవనాలుగా, అందులో పదుల సంఖ్యలో షో రూమ్‌లు, ప్రైవేటు ఆఫీసులు వంటివి కొనసాగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే, అందులోని సిబ్బంది సురక్షితంగా బయటపడేలా వీటి నిర్మాణం లేకపోవటమే స్వప్నలోక్ కాంప్లెక్సులో ఆరుగురి మరణానికి కారణమైందన్న వాదన బలంగా ఉంది. ఈ రకంగా వినియోగిస్తున్న కమర్షియల్ భవనాల్లో చాలావాటికి కనీసం పార్కింగ్ వసతి కూడా లేదు. మరికొన్నింటిలో సెల్లార్లలో గోదాంలు వంటి వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైఎంసీఏ వద్దనున్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించిన ఏకంగా తొమ్మిది మంది మృతి చెందిన ఘటన విధితమే.

నిర్మాణ అనుమతుల మంజూరీతో పనైపోతుందా?

వేగంగా పట్టణీకరణ జరుగుతున్న హైదరాబాద్ నగరంలో ఏభవనానికైనా నిర్మాణ అనుమతి జారీ చేస్తే, తమ పనైపోయిందని జీహెచ్ఎంసీ, ఈవీడీఎం అధికారులు భావించటం వల్లే వరుస అగ్నిప్రమాదాలకు బ్రేక్‌పడటం లేదన్న వాదనలున్నాయి. నిర్మాణ అనుమతి మంజూరు సమయంలో భారీగా లంచాలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆ తర్వాత రెసిడెన్షియల్ భవనాలను కమర్షియల్‌గా వినియోగించేందుకు వీలుగా లేకపోయినా, భవనయజమాని కాసుల కక్కుర్తితో కమర్షియల్‌గా వినియోగిస్తున్నా, అధికారులు ప్రశ్నించలేకపోతున్నట్లు తెలిసింది. ఇది గాక, దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు మరెన్నో ఉంటున్నట్లు సమాచారం.

కనీసం తాము మంజూరీ చేసిన భవన నిర్మాణ అనుమతి ప్రకారమే నిర్మాణం జరుగుతుందా? అన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయని జీహెచ్ఎంసీ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత ఫైర్ సేఫ్టీ లేకపోయినా, మళ్లీ లంచాలు గుంజుతూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయడం వల్లే, వాటిల్లోని ఇరుకు కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలు పోగొట్టుకోవల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి కూడా భవనాలకిచ్చిన అనుమతి ఏమిటి? వినియోగ మేమిటీ? అన్న కోణంలో ఒక్కసారి కూడా తనిఖీలు చేసిన దాఖలాల్లేవు.

ఇంకెంత కాలం పెండింగ్‌లో..

అయిదు కన్నా ఎక్కువ అంతస్తులో నిర్మించే రెసిడెన్షియల్ భవనాలతో పాటు అంతకన్నా తక్కువ అంతస్తులో నిర్మితమయ్యే కమర్షియల్ భవనాలకు కూడా ఫైర్ సేఫ్టీని తప్పనిసరి చేస్తూ జీహెచ్ఎంసీ సర్కారుకు పంపిన ప్రతిపాదనలు ఇంకా సర్కారు పరిశీలనలోనే ఉన్నాయి. ఏళ్ల క్రితం పంపిన ఈ ప్రతిపాదనపై సర్కారు ఏళ్లు నాన్చడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సర్కార్ నిర్ణయాన్ని తెలియజేస్తే తమ తరపున కొంత యాక్షన్ మొదలయ్యే అవకాశాలున్నాయని కొందరు జీహెచ్ఎంసీ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.


Next Story

Most Viewed