వేలానికి వేళాయె.. మరొకసారి హెచ్ఎండీఏ ప్లాట్లకు బహిరంగ వేలం..!

by Javid Pasha |   (  Updated:2025-11-01 10:46:17  IST  )

హెచ్ఎండీఏకు సంబంధించిన లే అవుట్లు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పార్శిళ్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించే బాధ్యతలను రాజీవ్ స్వగృహా కార్పొరేషన్ కు అప్పగించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది.

వేలానికి వేళాయె..  మరొకసారి హెచ్ఎండీఏ ప్లాట్లకు బహిరంగ వేలం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని లే అవుట్లలో ప్లాట్లు, ప్రభుత్వ భూములను మరోసారి వేలం వేయడానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ 17,18,19 తేదీల్లో నిర్వహించిన ఈ-వేలానికి ఏలాంటి స్పందన రాకపోవడంతో మరోసారి నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి తెలంగాణ రాజీవ్ స్వగృహా కార్పొరేషన్ లిమిటెడ్ (టీఆర్ఎస్సీఎల్) ద్వారా బహిరంగ వేలం నిర్వహించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాల్, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని బాచుపల్లి లేఅవుట్లకు సంబంధించిన ప్లాట్లను వేలం వేయనున్నారు. వీటితోపాటు పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను సైతం విక్రయించాలని నిర్ణయించారు.

రేటు తగ్గించే అవకాశం

తుర్కయంజాల్ లేఅవుట్ లోని 600 చ.గజాల నుంచి 1146 చ.గజాల విస్తీర్ణంలో ఉన్న 12 ప్లాట్లను విక్రయించనున్నారు. వీటికి ప్రారంభ ధర రూ.65వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీంతోపాటు బాచుపల్లి లేఅవుట్ లోని 266.67 చ.గజాల నుంచి 499.96చ.గజాల విస్తీర్ణంలో ఉన్న 70 ప్లాట్లను సైతం విక్రయించనున్నారు. వీటికి ప్రభుత్వం ధర రూ.70వేలుగా నిర్ణయించింది. ఈ సారి రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గత వేలంలో స్పందనరాకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

ప్రభుత్వ భూములను..

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లోని ప్రభుత్వ భూములను సైతం విక్రయించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రాంతాలు, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 7ప్రాంతాల్లో భూములను విక్రయించనున్నారు. వీటికి గతంలో ప్రకటించిన రేట్లతోనే వేలం వేస్తరా? ఏమైనా తగ్గిస్తారా? అనేది చూడాల్సిందే.

రాజీవ్ స్వగృహా కార్పొరేషన్ కు బాధ్యతలు

హెచ్ఎండీఏకు సంబంధించిన లే అవుట్లు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పార్శిళ్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించే బాధ్యతలను రాజీవ్ స్వగృహా కార్పొరేషన్ కు అప్పగించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ మధ్య కాలంలో రాజీవ్ స్వగృహా కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలానికి భారీగా స్పందన రావడంతోపాటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. హెచ్ఎండీఏ నిర్వహించిన ఈ-వేలానికి ఏలాంటి స్పందన రాలేదు. దీనికి ప్రచారం ఆశించిన స్థాయిలో లేకపోవడం, రేట్లు కూడా అధికంగా ఉండడమేనని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.



Next Story