- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూజల పేరుతో మోసం.. కుటుంబ సమస్యలు తీరుస్తానని నగదు, బంగారం చోరీ
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురూజీ సాయిరాజ్ అనే జ్యోతిష్యుడు కుటుంబ సమస్యలు తీరుస్తానని నమ్మబలికి దంపతుల నుంచి రూ. 32,000 నగదు, 5తులాల బంగారం అపహరించాడు.

దిశ, వనస్థలిపురం: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురూజీ సాయిరాజ్ అనే జ్యోతిష్యుడు కుటుంబ సమస్యలు తీరుస్తానని నమ్మబలికి దంపతుల నుంచి రూ. 32,000 నగదు, 5తులాల బంగారం అపహరించాడు. బాధితురాలు గుండు రజని ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... నాగోల్ లోని ఆనంత వీరారెడ్డి కాలనీకి చెందిన గుండు రజని తన భర్త ప్రవర్తనలో మార్పులు రావడంతో మార్చి 16న నాగోల్ లో రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నడుపుతున్న సాయిరాజ్‌ను సంప్రదించింది. మీ సమస్యలకు మూడో వ్యక్తి ప్రమేయం ఉందని, రూ.10 వేలు ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని నమ్మించాడు. దీంతో రజని... తన నగలను తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని చెల్లించింది.
రెండు రోజుల తర్వాత పూజలు చేశానని చెప్పిన సాయి రాజ్, అదనంగా మరో రూ, 22,000 డిమాండ్ చేయగా.. రజని మరోసారి తన నగలు తాకట్టు పెట్టి, UPI ద్వారా సిరిగరి సాయి కుమార్ ఖాతాకు పంపింది. ఆ తర్వాత నిమ్మకాయలో అల్యూమినియం షీట్ పెట్టి మంచం కింద ఉంచమని, రెండు రోజుల తర్వాత సమస్యకు కారణమైన వ్యక్తి పేరు షీట్‌పై కనిపిస్తుందని సాయి రాజ్ చెప్పాడు. అయితే, నిమ్మకాయను తెరిచి చూసినప్పుడు షీట్ కనిపించలేదని చెప్పడంతో సాయి రాజ్ తన గురూజీని సంప్రదిస్తే మంచి జరుగుతుంది రజనికి సూచించాడు.
రజని పరిస్థితి క్లిష్టంగా ఉందని, వశీకరణ పూజ చేయాలని గురూజీ సలహా ఇచ్చాడు. మూడు దశల పూజలో భాగంగా, మొదటిది భర్తతో సంబంధాలు మెరుగుపడటానికి బంగారంతో వశీకరణ పూజ, రెండోది మూడో వ్యక్తి ప్రభావం తొలగించడానికి అడవిలో చెట్టు కింద నిమ్మకాయలు ఉంచే పూజ, మూడోది భర్తలోని ఆత్మహత్య ఆలోచనలను తొలగించడానికి మూడు మేకలను బలిచ్చే పూజ అని చెప్పాడు. ఈ పూజలు చేయకపోతే భర్తను శాశ్వతంగా కోల్పోతావని బెదిరించాడు. భయపడిన రజని, తన అత్తగారి 5 తులాల బంగారు ఆభరణాలను సాయి రాజ్‌కు అప్పగించింది. మొదటి పూజ తర్వాత బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి మిగిలిన పూజలు చేస్తానని సాయి రాజ్ చెప్పాడు. ఆ తర్వాత కూడా రజనికి గురూజీ సాయి రాజ్, అతని గురూజీ నుండి పదే పదే కాల్స్ వచ్చాయి. మోసపోయానని గ్రహించిన రజని నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు పూజారి పరారీలో ఉన్నాడని సీఐ సూర్యా నాయక్ తెలిపారు. ఈ మేరకు జ్యోతిష్యుడు, అతడి గురువుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.






