ఎలక్షన్ డ్యూటీ చేయకుంటే ఇంటికి పోలీసులు వస్తారు

by Disha Web Desk 12 |
ఎలక్షన్ డ్యూటీ చేయకుంటే ఇంటికి పోలీసులు వస్తారు
X

దిశ, సిటీబ్యూరో: పార్లమెంట్ ఎలక్షన్ డ్యూటీల కోసం నియమించిన సిబ్బంది, ఆఫీసర్లు తప్పకుండా తమకు కేటాయించిన డ్యూటీలు చేయాల్సిందేనని, లేని పక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని ఇంటికి పోలీసులు వస్తారంటూ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అల్టిమేటం జారీ చేశారు. గత నెల 16న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే జిల్లా ఎన్నికల యంత్రాంగం మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం అవసరమైన స్టాఫ్‌తో పాటు 20 శాతం రిజర్వుతో మొత్తం 25 వేల 500 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు మొదలుకుని సెక్టోరియల్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు అదర్ పోలింగ్ ఆఫీసర్లుగా నియమించుకుంది. వీరిలో 1700 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు కాగా, 120 మంది మైక్రో అబ్జర్వర్స్, మరో 2 వేల మంది అదర్ పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు.

కానీ ఇప్పటి వరకు నిర్వహించిన శిక్షణ శిబిరాలకు సుమారు 21 వేల మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. మరో 2500 మంది స్టాఫ్ అవసరమున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు నిర్వహించిన వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలకు కేవలం 1700 మంది సిబ్బంది, అధికారులు గైర్హాజరైనట్లు గుర్తించారు. వీరికి మొదటి, రెండో షోకాజ్ నోటీసులు జారీ చేసినా, వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని జిల్లా ఎన్నికల అధికారి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 16న జారీ చేసిన పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18న నోటిఫికేషన్‌ను జారీ చేసి, అదే రోజు నుంచి నామినేషన్ల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రెండు సార్లు షోకాజ్ నోటీసులు జారీ చేసినా, ఎలక్షన్ స్టాఫ్ స్పందించకపోవటాన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. తాము జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఈ నెల 18వ తేదీలోపు సమాధానమిచ్చి, ఎలక్షన్ డ్యూటీ లో చేరాల్సిందేనని, లేని పక్షంలో వారిపై ఎపుడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సిబ్బంది ఇంటికి పోలీసులు వెళ్లనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వ్యాఖ్యానించారు. ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల డ్యూటీలు ముమ్మరమయ్యే సమయంలో కావలసిన సంఖ్యలో సిబ్బంది లేకపోతే, తాము ఎన్నికల విధులెలా చేయాలంటూ జిల్లా ఎన్నికల అధికారి తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు.

20 తర్వాత సిటీకి సెంట్రల్ అబ్జర్వర్స్..

ఈ నెల 20 తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నియమించిన పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్స్ సిటీకి రానున్నట్లు సమాచారం. ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చును రూ.95 లక్షలుగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు సమాచారం. ఈ సెంట్రల్ అబ్జర్వర్స్ అభ్యర్థుల ఎన్నికల వ్యయం పైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. ఈ అబ్జర్వర్స్ అంతా వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉండనున్నట్లు సమాచారం. ఈ అబ్జర్వర్స్ ఎక్కడ బస చేస్తున్నారన్న విషయాన్ని గోప్యంగా ఉంచి, కేవలం వారి ఫోన్ నెంబర్లు మాత్రమే ప్రజల్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. వీరి పేర్లు, ఫోన్ నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా విలువైన వస్తువులు, నగదు, మద్యం పంపిణీ చేసే వారిపై కూడా ఈ సెంట్రల్ అబ్జర్వర్స్ డేగ కన్ను పెట్టనున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed