చదువులో ఫెయిల్ అయినా... ప్రాథమిక విద్యార్హత లేకున్నా... డిగ్రి, బీటెక్ సర్టిఫికేట్ లు రెడీ...

by Bhanu |   (  Updated:2025-05-15 12:55:09  IST  )

ఎస్ఎస్ సి, ఇంటర్మీడియట్, డిగ్రిలో ఫెయిల్ అయ్యారా...అయినా నో ప్రాబ్లెమ్ మీకు డిగ్రి, బీటెక్, ఎంబిఏ, ఎంసిఏ, ఇంకా ఏలాంటి విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్ కావాలంటే జస్ట్ డబ్బులు చెల్లిస్తే చాలు 20 రోజులలో సర్టిఫికేట్ రెడీ అవుతుంది.

చదువులో ఫెయిల్ అయినా... ప్రాథమిక విద్యార్హత లేకున్నా... డిగ్రి, బీటెక్ సర్టిఫికేట్ లు రెడీ...
X

దిశ, సిటీక్రైం : ఎస్ఎస్ సి, ఇంటర్మీడియట్, డిగ్రిలో ఫెయిల్ అయ్యారా...అయినా నో ప్రాబ్లెమ్ మీకు డిగ్రి, బీటెక్, ఎంబిఏ, ఎంసిఏ, ఇంకా ఏలాంటి విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్ కావాలంటే జస్ట్ డబ్బులు చెల్లిస్తే చాలు 20 రోజులలో సర్టిఫికేట్ రెడీ అవుతుంది. మీరు కార్పోరేట్ లో జాబ్ చేయాలనుకుంటున్నారా... అయితే మీ దగ్గర విద్యార్హత సర్టిఫికేట్ లేదా డోంట్ వర్రి మాకు డబ్బులు ఇవ్వండి మీ పేరు మీద సర్టిఫికేట్ ను తీసుకువచ్చిస్తామంటూ హైదరాబాద్ లో దందా చేస్తున్న ముగ్గురు ఏజెంట్ లను టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...హైదరాబాద్ శాలివాహన నగర్ ప్రాంతానికి చెందిన కడారి రమేశ్ న్యాయవాది వ్రుత్తిలో ఉన్నారు.

యాకత్ పురాకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఇస్మాయిల్, మసాబ్ ట్యాంక్ కు చెందిన షాబాజ్ ఖాన్ లు ఈ నకిలీ సర్టిఫికేట్ లను ఎవరికైనా కావాలంటే ఢిల్లీ లోని సాగర్ ద్వారా తీసుకువస్తున్నారు. సాగర్ కు వీరు ఏజెంట్ లుకా పని చేస్తున్నారు. ఈ ముగ్గురు ఎవరికి వారు డ్రాప్ ఔట్ లను ఎంచుకుని నకిలీ సర్టిఫికేట్ లను ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇలా గత 2 సంవత్సరాల నుంచి వీరు ఢిల్లికి చెందిన సాగర్ ద్వారా చాలా మందికి నకిలీ సర్టిఫికేట్ లను ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. న్యాయవాది రమేశ్ కూడా గతంలో కొన్ని కాలేజీలలో లెక్చరర్ గా పని చేయడంతో చాలా మంది విద్యార్ధులకు నకిలీ సర్టిఫికేట్ లను ఇస్తానని చెప్పుకున్నాడు. అలా వీరు డిగ్రి సర్టిఫికేట్ కు 80 వేల నుంచి 1.20 లక్షలు, బీటెక్ సర్టిఫికేట్ కోసం 3.50 లక్షలు, ఎంబిఏ, ఎంసిఏ సర్టి ఫికేట్ లకు 2.50 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకుని ఢిల్లీ లో ఉన్న గ్లోకల్ యూనివర్సిటీ , మోనాడ్ యూనివర్సిటీ లకు చెందిన ఫేక్ సర్టిఫికేట్ లను ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు నిందితుల నుంచి 15 సర్టిఫికేట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డబ్బులు తీసుకుని సర్టిఫికేట్ ఇవ్వలేదు

న్యాయవాది కడారి రమేశ్ , షాబాజ్ , అబ్దుల్ ఇస్మాయిల్ వ్యవహారం లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. అబ్దుల్ ఇస్మాయిల్ కు ఓ విద్యార్థి తనకు డిగ్రి సర్టిఫికేట్ కావాలని 2 లక్షలు రూపాయాలను ఇచ్చాడు. అయితే సర్టిఫికేట్ ఇవ్వడంలో నెల రోజులకు పైగా దాటుతుండడంతో బాధితుడు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఇస్మాయిల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా కడారి రమేశ్ తో పాటు షాబాజ్ ఖాన్ గుట్టు బయటపడింది. దీంతో పోలీసులు మొత్తం వ్యవహారం పై దర్యాప్తు చేసి నకిలీ సర్టిఫికేట్ ల దందా గుట్టును బయటపెట్టారు. ఢిల్లీ కి చెందిన సాగర్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story