ఎస్ఎఫ్ఏ‌ల బదిలీపై మాజీ ఎమ్మెల్సీ, ఉన్నతాధికారి జోక్యం

by Mahesh |
ఎస్ఎఫ్ఏ‌ల బదిలీపై మాజీ ఎమ్మెల్సీ, ఉన్నతాధికారి జోక్యం
X

దిశ, సిటీ బ్యూరో: రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా వివిధ ప్రభుత్వ శాఖల్లో తీసుకుంటున్న పరిపాల పరమైన నిర్ణయాలకు రాజకీయాలు అడ్డు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుధ్య పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవటం, క్షేత్ర స్థాయిలో పారిశుధ్య పనులను పర్యవేక్షించాల్సిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎ ఫ్ఏ)లను నగరంలోని ఆరు జోన్ల లో ఓ జోన్ నుంచి మరో జోన్ కి బదిలీ చేసేందుకు జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత నగరంలోని ఆరు జోన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 900 పై చిలుకు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎవరు? ఎక్కడ? ఎంత కాలం నుంచి పని చేస్తున్నారన్న సమాచారాన్ని సేకరించి, వారి ట్రాన్స్‌ఫర్ల కోసం ఆ విభాగం ఫైల్ ను సిద్ధం చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్ఎఫ్ఏలు కొందరు తమ బదిలీ ప్రాసెస్ ను నిలిపివేయాలంటూ ఓ మాజీ ఎమ్మెల్సీని ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో సదరు ఎమ్మెల్య్సీ తొలుత కమిషనర్ రోనాల్డ్ రోస్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన లైన్ లోకి రాకపోవటంతో సదరు మాజీ ఎమ్మెల్సీ తనకున్న పలుకుబడితో మున్సిపల్ శాఖలోని ఓ ముఖ్యమైన అధికారిని సంప్రదించినట్లు సమాచారం.

అంతంతమాత్రం జీతాలకు పని చేసే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఓ జోన్ నుంచి మరో జోన్‌కి బదిలీ చేస్తే వారు డ్యూటీలు చేసేందుకు, రాకపోకలు సాగించేందుకు కష్టతరమవుతుందంటూ సదరు మున్సిపల్ శాఖలోని ముఖ్యమైన అధికారితో చర్చించినట్లు సమాచారం. దీంతో ఆ అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్‌కు ఫోన్ చేసి, ఎస్ఎఫ్ఏల ట్రాన్స్ ఫర్ ఫైలు ప్రాసెస్ ను నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. కానీ త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్నందున కమిషనర్ ప్రస్తుతం ఈ ట్రాన్స్‌ఫర్లను పక్కనబెట్టినట్లు సమాచారం. కానీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నగరంలోని 30 సర్కిళ్లలోని ఎస్ఎఫ్ఏలతో పాటు మెడికల్ ఆఫీసర్లను కూడా ట్రాన్స్ ఫర్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నాలుగేళ్ల క్రితం ర్యాండమైజేషన్ పద్ధతిలో అప్పుడున్న 946 మంది ఎస్ఎఫ్ఏల ట్రాన్స్ ఫర్లు చేసిన తర్వాత మొత్తం ఎస్ఎఫ్ఏలను భారీగా ట్రాన్స్ ఫర్ చేసేందుకు ప్రయత్నం జరగటం ఇది రెండోసారి. అయితే అపుడు ఈ ఎస్ఎఫ్ఏల్లో మహిళా ఎస్ఎఫ్ఏలకు బదిలీలు మినహాయించాలని నిర్ణయించడంతో కొందరు ఎస్ ఎఫ్ ఏలు బదిలీల నుంచి తప్పించుకునేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఐటీ శాఖ అధికారులను మేనేజ్ చేసుకుని తమ పేర్లను తాత్కాలికంగా మహిళ పేరుగా మార్చుకునేందుకు ప్రయత్నించడం అప్పట్లో సంచలనంగా మారింది.

Next Story