ఓఆర్ఆర్ పై నిద్ర‌పోతూ డ్రైవింగ్

by Ratna Kumari |

ఓఆర్ఆర్ పై ఇక నుంచి జీరో యాక్సిడెంట్ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.

ఓఆర్ఆర్ పై నిద్ర‌పోతూ డ్రైవింగ్
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ చుట్టు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకు పోలీసుల‌తో రవాణ శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, అర్బన్ ఫారెస్ట్రీ, నేషనల్ హైవే అథారిటీ, హెజీసీఎల్, ఐఆర్ బీ ఇన్ ఫ్రా ప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో పోలీసు కమిషనర్ సజ్జనార్ మంగళవారం బంజారాహిల్స్ టీజీఐసీసీసీ భవనంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఆర్ఆర్ పై ఇక నుంచి జీరో యాక్సిడెంట్ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. అంతకుముందు ఐఆర్బీ సంస్థ ఓఆర్ఆర్ పై తీసుకుంటున్న భద్రత చర్యలు, నిర్వాహణకు సంబంధించిన ప్రజంటేషన్ ను ఇచ్చారు. నాలుగు నెలలుగా ఓఆర్ఆర్ పై చోటు చేసుకున్న యాక్సిడెంట్ లు ఏ కారణంగా చోటు చేసుకున్నాయనే అంశాలను విశ్లేషించారు.

నిద్రమత్తులో జరిగినవి 33 శాతం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల 25 శాతం, అతివేగం 15 శాతం, టైర్లు పేలడం వల్ల 14 శాతం వరకు ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలో వాహనదారులకు వీటి పై పూర్తి అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. దీని కోసం ఓఆర్ఆర్ పై ప్రయాణించే వాహనదారుల మొబైల్ ఫోన్ లకు మెస్సేజ్ ల ద్వారా యాక్సిడెంట్ లను నివారించేందుకు తీసుకోవాల్సిన భద్రత పరమైన జాగ్రత్తలను తెలియజేయాలన్నారు. ప్రతి రోజు ఓఆర్ఆర్ పై దాదాపు 2.80 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. ఓఆర్ఆర్ పై ట్రాఫిక్ మార్షల్స్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో వాహనదారులకు సేవలను అందించేందుకు వేగంగా స్పందించే విధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. అనివార్యకారణాల వల్ల ఓఆర్ఆర్ పై వాహనాలను నిలపాల్సిన పరిస్థితి వస్తే వెంటనే హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడంతో పాటు వాహనాన్ని ఎడమ వైపు చివరి లేన్ లోనే ఆపాలన్నారు. మధ్యలో ఎట్టి పరిస్థితిలో వాహనాలను నిలపరాదని హెచ్చరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీసు అధికారులతో రవాణ శాఖ కమిషనర్ ఇలంబర్తి ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story