నాలుగు నెలలుగా నత్తనడకన డ్రైనేజీ పనులు..!

by Taduka Kalyani |

చంపాపేట్ డివిజన్ పరిధిలో పద్మ ఎన్‌క్లేవ్‌లో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు నెలల తరబడి పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నాలుగు నెలలుగా నత్తనడకన డ్రైనేజీ పనులు..!
X

దిశ,చంపాపేట్ జూలై 03: చంపాపేట్ డివిజన్ పరిధిలో పద్మ ఎన్‌క్లేవ్‌లో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు నెలల తరబడి పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ప్రారంభించి సుమారు నాలుగు నెలలు గడిచినా ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్థానికుల వివరాల ప్రకారం.. మే 20, 2026న డ్రైనేజీ స్లాబ్ వేశారు. అయితే, ఆ తర్వాత కూడా స్లాబ్‌కు ఇరువైపులా మట్టిని నింపకపోవడంతో రహదారి వినియోగానికి అనుకూలంగా మారలేదు. దీంతో రోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా నిర్మాణంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైప్ పరిమాణం చాలా చిన్నదిగా ఉందని, భవిష్యత్తులో వర్షాకాలంలో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనుల పురోగతిపై కాంట్రాక్టర్ సూపర్‌వైజర్‌ను ప్రశ్నించగా, ఇంకా పలుమాసాలు పడుతుందని చెప్పారని స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయని వారు వాపోతున్నారు. పద్మ ఎన్‌క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఏఈ , డీఈ అధికారులకు వినతి చేస్తూ, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని, స్లాబ్ పక్కన మట్టి నింపి రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే డ్రైనేజీ పైపు సామర్థ్యాన్ని సాంకేతికంగా పరిశీలించి అవసరమైతే తగిన పరిమాణంలో పైపును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. స్థానికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పనులను పూర్తి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్లక్ష్యంగా వదిలేసిన డ్రైనేజీ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనని పద్మ ఎన్‌క్లేవ్ వాసులు ఆందోళన చెందుతున్నారు.

Next Story