జాప్యం లేకుండా రుణ వితరణ చేయండి: అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

by Kalyani |
జాప్యం లేకుండా రుణ వితరణ చేయండి: అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల అమలులో లబ్ధిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా రుణ వితరణ చేసి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలవాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బ్యాంకర్లను కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంక్ అధికారులు నామినేట్ చేసిన బాధ్యత గల అధికారులు డీసీసీ మీటింగ్ లకు పూర్తి సమాచారంతో రావాలని నిర్ధేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా గ్రౌండింగ్ చేయించాల్సిన బాధ్యత బ్యాంక్ అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు.

వివిధ బ్యాంక్ లలో సంక్షేమ శాఖలకు చెందినవి, గ్రౌండింగ్ లో పెండింగ్ లో ఉన్న యూనిట్లను వెంటనే క్లియర్ చేసి యూసీలు వెంటనే ఇవ్వాలని ఆయన బ్యాంకర్లను ఆదేశించారు. సంక్షేమ శాఖ అధికారులు వారికి నిర్ధేశించిన బ్యాంక్ లలో పెండింగ్ లో ఉన్న, గ్రౌండింగ్ కానీ యూనిట్లను పరిష్కరించేందుకు గాను బ్యాంక్ అధికారులను తరచుగా సంప్రదిస్తూ పూర్తి చేయాలన్నారు.

ఎల్డీఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ లో 2022-23 సంవత్సరానికి కేటాయించిన రూ. 21,273.40 కోట్లు లక్ష్యం కాగా, గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి రూ. 46,705.51 కోట్లు అంటే 183 శాతం లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. ప్రయార్టీ సెక్టార్లో రూ. 25,413.74 కోట్లకు గాను రూ. 46,705.51 కోట్లు అంటే 183.80 శాతం వృద్ధి సాధించడం జరిగిందన్నారు. అనంతరం నాబార్డ్ రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ అధికారి ప్రవీణ్ కుమార్, బ్యాంక్ అధికారులు అనిల్ కల్బేడే, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story