మ్యూల్ ఖాతాల‌ను అరిక‌ట్టేందుకు RBI కి సీపీ సజ్జనార్ లేఖ

by Ratna Kumari |

సైబర్ నేరగాళ్లకు కేంద్రంగా మారిన మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మంగళవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మ‌ల్హొత్ర కి లేఖ రాశారు.

మ్యూల్ ఖాతాల‌ను అరిక‌ట్టేందుకు RBI కి సీపీ సజ్జనార్ లేఖ
X

దిశ‌, సిటీ క్రైమ్ : సైబర్ నేరగాళ్లకు కేంద్రంగా మారిన మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మంగళవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మ‌ల్హొత్ర కి లేఖ రాశారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇటీవల చేపట్టిన అపరేషన్ అక్టోపస్ 2 లో వెలుగు చూసిన బ్యాంకింగ్ లోపాలను ఆయన లేఖ ద్వారా ఆర్బీఐ దృష్టికి తీసుకువెళ్ళారు. అమాయకుల పేరిట తెరుస్తున్న బ్యాంక్ ఖాతాల వెరిఫికేషన్ లో బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టం గా ఉందని ఆయన లేఖలో వివరించారు. ఈ నేపధ్యంలో బ్యాంకింగ్ వ్యవస్ధలో మార్పులు తీసుకురావాలని సూచించారు. బ్యాంక్ ఖాతాలను తెరిచేందుకు ఆర్ బీఐ రూపొందించిన నిబంధనలను కచ్చితంగా బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాటించేలా చూడాలన్నారు. కేవైసీ వెరిఫికేషన్ లో లోపాలు లేకుండా చూడాలన్నారు. ఖాతాల తెరిచే ప్రక్రీయకు సంబంధించి బ్యాంక్ అధికారుల పాత్రను నిర్ధారించేలా ఆర్ బీఐ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేవైసీ మార్గదర్శకాలు బ్యాంక్ అధికారులు పాటిస్తున్న అంశం పై క్షేత్రస్థాయిలో తరచు ఆడిట్ జరగాలన్నారు.

ప్రజల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన బ్యాంక్ అధికారులు సైబర్ నేరగాళ్లతో చేతులు కలుపుతున్నారని సీపీ సజ్జనార్ లేఖలో ప్రస్తావించారు. ప్రైవేటు బ్యాంక్ లలో ఇలాంటి అక్రమ ఖాతాలు ఎక్కువ తెరుస్తుండడం ఆందోళన కలిగిస్తుందన్నారు. సైబర్ నేరాలకు సహాకరించి అరెస్టైన, ఛార్జీషీటు దాఖలైన బ్యాంక్ అధికారుల వివరాలను బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు. మ్యూల్ ఖాతాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకునేందుకు ఆర్బీఐ ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీసులతో జాయింట్ వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలన్నారు. అనుమానాస్పద లావాదేవిలను క్షణాల్లో గుర్తించే సాంకేతికత ను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ప్రజలు కూడా ఎవరు కూడా వారి ఖాతాలను గుర్తు తెలియని వారికి ఇవ్వొద్దని తెలిపారు. కమీషన్ లకు ఆశపడి బ్యాంక్ ఖాతాలను ఇస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైనప్పుడు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సీపీ వివరించారు.

Next Story