AITUC: కాంట్రాక్ట్ నర్సుల ఆవేదన: జీతాలు లేక ఇబ్బందులు, నిరవధిక సమ్మె హెచ్చరిక

by Ramesh Naini |

కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు ఇవ్వక పోతే ఎలా జీవిస్తారని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రశ్నించారు.

AITUC: కాంట్రాక్ట్ నర్సుల ఆవేదన: జీతాలు లేక ఇబ్బందులు, నిరవధిక సమ్మె హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Contract Nursing) కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు ఇవ్వక పోతే ఎలా జీవిస్తారని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రశ్నించారు. 2020 కరోనా సమయంలో టిమ్స్ ఆస్పత్రి నిర్వహణకు కాంట్రాక్టు పద్ధతిన నర్సింగ్ సిబ్బందిని నియమించుకోవడం జరిగిందని వారిని 2022 సంవత్సరంలో నీలోఫర్ హాస్పిటల్, సరోజినీ హాస్పిటల్, ఈఎన్‌టీ హాస్పిటల్, కోఠి హాస్పిటల్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లకు విధులు నిర్వహించేందుకు పంపించడం జరిగిందని నాటి నుంచి విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందికి గత ఏప్రిల్ మాసం నుంచి జీతాలు ఇవ్వకపోవడం వలన వారి కుటుంబాలు వేదన పడుతున్నాయని ఆయన ప్రభుత్వానికి తెలియజేశారు. మంగళవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో టీమ్స్ ద్వారా నియమితులైన కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది కోఠీలోని డీఎంఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా వీరి సేవలను డీఎంఈ అధికారులు వినియోగించుకుంటున్నారని మార్చి వరకు టిమ్స్ ద్వారా వీరికి జీతాలు అందినాయని ఏప్రిల్ నుంచి డీఎంఈ పరిధి నుంచి జీతాలు అందాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం వలన డ్యూటీలు అయితే చేయించుకుంటున్నారు కానీ జీతాలు ఇవ్వడం లో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని వారు పేర్కొన్నారు. జీతాల కోసం డీఎంఈ అధికారులను ఆస్పత్రి సూపరింటెండెంట్ లను వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఎన్ని పర్యాయాలు అడిగిన సమస్య పరిష్కారం కాని దృష్ట్యా నేడు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించవలసి వచ్చిందన్నారు.

వెంటనే జీతాలను చెల్లించకపోతే భవిష్యత్తులో నిరవధిక సమ్మెను నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం డీఎంఈ కార్యాలయంలో అడిషనల్ డీఎంఈ అనితాగ్రేసికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎంఎస్ మూర్తి, ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి వెంకటయ్య, ఉప ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కిషన్, నర్సింగ్ సిబ్బంది ప్రవీణ కుమారి, సౌందర్య, శాంతి, హెఫ్సిబా, స్వప్న, సువర్ణ, రేవతి, మేఘమాల, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.

Next Story