హైకోర్టు ఆర్డర్ అయితే మాకేంటి..?

by Naveena |

శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో జీహెసీఎంసీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా కొనసాగుతుంది

హైకోర్టు ఆర్డర్ అయితే మాకేంటి..?
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో జీహెసీఎంసీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా కొనసాగుతుంది. జోనల్ పరిధిలోని అన్ని సెంటర్స్ లో అనుమతులు లేని నిర్మాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అయినా అధికారులు నామమాత్రపు చర్యలతో మమా అనిపిస్తుండడంతో.. అక్రమ నిర్మాణదారులు మరింతగా రెచ్చిపోతున్నారు. అన్నీ తెలిసినా అధికారులు ఎందుకో కానీ వెనకుండి చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే కోర్టు ఆదేశాలను కూడా బేఖాతారు చేస్తూ.. ఇల్లీగల్ నిర్మాణాలు సాగిస్తుండగా, ఇంకొందరు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత దాని మీద కొత్త కట్టడాలు కొనసాగిస్తున్న ఘటనలు శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో సర్వసాధారణంగా మారాయి.

ఆక్యుపెన్సీ వచ్చాక కొత్త నిర్మాణం

చందానగర్ సర్కిల్ 21 పరిధిలోని మాదాపూర్ డివిజన్ మాతృశ్రీ నగర్ ప్లాట్ నెంబర్ 1100లో గతంలో నం.0092/GHMC/SLP/2024/BP ఫైల్ నంబర్ 000539/GHMC/0244/SLP2/2024-BP లో స్టిల్ట్ + 4 పై అంతస్తులకు అనుమతులు ఉండగా భవన నిర్మాణం చేశారు. దీనికి జీహెసీఎంసీ అధికారులు 11.02. 2025న ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేశారు. అయితే అటు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాగానే భవన యజమానులు అదే భవనంపై అనధికార నిర్మాణాన్ని మొదలు పెట్టారు. దీనిపై ఓ వ్యక్తి చందానగర్ జీహెసీఎంసీ అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అయినా టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించలేదు.

కోర్టు ఆదేశాలు బేఖాతారు..

చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించక పోవడంతో హఫీజ్ పేట్ విలేజ్ సర్వే నెంబర్ 54, ప్లాట్ నెంబర్ 1100లో ఇల్లీగల్ నిర్మాణం సాగుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ సీహెచ్ కోటేశ్వర రావు అనే వ్యక్తి రాష్ట్ర హైకోర్టులో W.P.No.9313 పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు పనులను ఆపివేయాలంటూ హై కోర్టు ఉత్తర్వులు PA29/3/25 జారీ చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు తమ కార్యాలయానికి అందినట్లు ఇన్ వార్డులో సెక్షన్ క్లర్క్ ధృవీకరించారు. ఇల్లీగల్ నిర్మాణంపై స్వయంగా హై కోర్టు పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసినా పనులు కొనసాగడం చందానగర్ సర్కిల్ టీపీఎస్ అధికారుల ఉత్తమ పనితీరుకు అద్దం పడుతుంది. హై కోర్టు ఉత్తర్వులు ఉన్నా, ఓసీ ఇచ్చిన అనంతరం అదనపు అంతస్తులు నిర్మించడం పై సీపీఎం పార్టీ శేరిలింగంపల్లి కన్వీనర్ చల్లా శోభన్ బుధవారం చందానగర్ సర్కిల్ డీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏసీపీ నాగిరెడ్డి ఇతర అధికారులు కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై ఏసీపీ నాగిరెడ్డిని దిశ వివరణ కోరగా ఇల్లీగల్ నిర్మాణం నిజమేనని, తమ దృష్టికి రాగానే నోటీసులు జారీ చేశామని తెలిపారు.

ముడుపులు తీసుకుని హై కోర్ట్ ఆర్డర్ బుట్టదాఖలు : చల్లా శోభన్ సీపీఎం పార్టీ నాయకులు

గతంలో జీహెసీఎంసీ అనుమతుల మేరకు భవన నిర్మాణం చేపట్టిన నిర్మాణదారులు ఆక్యుపెన్సీ తీసుకున్న తర్వాత అదే భవనంపై అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. దీనిపై కోటేశ్వరరావు అనే వ్యక్తి పనులు ఆపేయాలంటూ ఇది వరకు కోర్ట్ ఆర్డర్ తీసుకువచ్చారు. సీపీఎం పార్టీ తరపున చందానగర్ డీసీకి ఫిర్యాదు అందజేశాం. అయినా ఏసీపీ నాగిరెడ్డి భవన నిర్మాణదారుడి వద్ద ముడుపులు తీసుకుని ఇల్లీగల్ నిర్మాణాలకు వంతపాడుతున్నారు. నిర్మాణదారుడిపై, ఇల్లీగల్ నిర్మాణాలకు సహకరిస్తున్న టీపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.

Next Story