ఎల్బీనగర్ లో భగ్గుమన్న ప్రోటోకాల్ వార్

by Naveena |

ఎల్బీనగర్ లోని మన్సూరాబాద్ డివిజన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే , బీజేపీ కార్పొరేటర్ మధ్య రాజుకున్న ప్రొటోకాల్ వివాదం కాస్తా.. తీవ్ర గందరగోళానికి దారితీసింది.

ఎల్బీనగర్ లో భగ్గుమన్న ప్రోటోకాల్ వార్
X

దిశ, వనస్థలిపురం: ఎల్బీనగర్ లోని మన్సూరాబాద్ డివిజన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే , బీజేపీ కార్పొరేటర్ మధ్య రాజుకున్న ప్రొటోకాల్ వివాదం కాస్తా.. తీవ్ర గందరగోళానికి దారితీసింది. మహిళ కార్పొరేటర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుధీర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎల్బీనగర్ ఎస్ఐ, ఏసీపీలకు కంప్లైంట్లు ఇచ్చారు. అనంతరం హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి, కాంగ్రెస్పార్టీ , ఎస్టీ సెల్నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుటే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఎల్బీనగర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రావు విగ్రహాల వద్దకు ర్యాలీగా వెళ్లి .. రహదారిపై సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

శంకుస్థాపనల వద్ద తలెత్తిన వివాదం..

ఈ నెల 12 న మన్సూరాబాద్ డివిజన్ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తమకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే కొబ్బరి కాయలు కొట్టారని, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి, బీజేపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించడం లేదని కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి గత బుధవారం ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించారు. దీంతో ఈ రోజు అదే అభివృద్ధి పనులకు కొప్పుల కొబ్బరికాయ కొట్టారు. ‘శంకుస్థాపన పూర్తి అయిన పనులకు మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారు’ అని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ డివిజన్ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు జక్కిడి రఘువీర్ రెడ్డి, కార్యకర్తలు కొప్పులను అడ్డుకొని నిరసనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే హయత్ నగర్ ఎస్ఐ నాగరాజు గౌడ్ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు పలు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ కు చేరుకున్నారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ డీసీపీ ఆఫీస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సామ తిరుమల్ రెడ్డి,సాగర్ రెడ్డి, పద్మ నాయక్, భవాని ప్రవీణ్ ఉన్నారు.

చిల్లర రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్యే :కార్పొరేటర్లు

అసెంబ్లీ జరుగుతున్న సమయంలో నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో చర్చించాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవలు సృష్టిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహా రెడ్డి, వంగమధుసూదన్ రెడ్డి లు ఆరోపించారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి గెలిచిన కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా ఓడిపోయిన మాజీ కార్పొరేటర్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. తాము ప్రజాసామ్యబద్ధంగా ప్రజలతో కలిసి శంకుస్థాపనలు చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీల వచ్చి దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని భావించిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. డివిజన్ లలో అభివృద్ధి చేసేందుకు తాము కష్టపడి నిధులు తెచ్చుకుంటే ఆయన మమ్మల్ని పక్కన పెట్టి శంకుస్థాపనలు చేస్తూ చిల్లరగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే తన తీరు మార్చుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో ఎల్బీ నగర్ నుంచి ట్యాక్స్ లు తీసుకోవడం తప్ప అనాపైస తెచ్చింది లేదు అన్నారు.

సుధీర్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం..

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనపై అసభ్య, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. కించపరుస్తున్నారని హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా ఎమ్మెల్యే తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని, ఇప్పుడు మాటలతో అవమానిస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఎల్బీనగర్ లోని అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బానోతు సుజాత నాయక్ మాట్లాడుతూ.. ‘గిరిజన మహిళనైన నాకు ఇంత అవమానమా..? నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ, నా కుటుంబాన్ని బజార్ లో పడేస్తూ సుధీర్ రెడ్డి ఇంత నీచంగా మాట్లాడతావా? నన్ను, నా కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. నీకు భార్య, కోడళ్ళు ఉన్నారు కదా .. వారిని ఎవరైనా అంటే భరిస్తావా..?ఎక్కడో మన్సూ రాబాద్ డివిజన్ లో జరిగిన కార్యక్రమంలో నన్ను ఉద్దేశించి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడడం ఏమిటీ? నాకు న్యాయం జరిగేంత వరకు.. సుధీర్ రెడ్డిని వదిలిపెట్టను. చెప్పుతో కొడతాను అంటూ చెప్పు చూపించారు. ఎల్బీనగర్లో నీ ఆటలు సాగుతలేవని, ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నావు.

సుధీర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేశాను . చట్ట ప్రకారం పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని సుజాత నాయక్ చెప్పారు. అనంతరం దర్పల్లి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ‘సుధీర్ రెడ్డి కేసు పై నమోదు చేసి అరెస్టు చేసేంత వరకు ఊరుకునేది లేదు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన సిగ్గుచేటు అని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. తోటి కార్పొరేట్ అయిన సుజాత నాయక్ కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి , మంత్రుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సుధీర్ రెడ్డిని అరెస్టు చేసే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లింగాల కిషోర్ గౌడ్, చెన్నగోనీ రవీందర్ గౌడ్, కుట్ల నర్సింహా యాదవ్, డైరెక్టర్లు బుడ్డ సత్యనారాయణ, పాశం అశోక్ గౌడ్ నేలపాటి రామారావు తదితరులు ఉన్నారు.

Next Story