- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యప్ప కేరాఫ్ అక్రమ నిర్మాణాలు
- అనుమతులు లేకున్నా గాలి మేడలు
- అయ్యప్ప సొసైటీలో బిల్డర్ల ఇష్టారాజ్యం
- ఎన్ని అంతస్థులు కట్టుకున్న ఆడిగేవారే లేరు
- జీహెచ్ఎంసీ అధికారుల చేతులు తడిపితే చాలు..
దిశ, శేరిలింగంపల్లి: ప్రభుత్వం మారినా.. అధికారులు మారినా.. అక్రమ అక్రమ కట్టడాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారుల తీరు సైతం మారడం లేదు. అధికారుల పనితీరుపై విమర్శలు గుప్పుమంటున్నా.. టీపీఎస్ అధికారులు ఎందుకో లైట్ తీసుకుంటున్నారు. అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ.. ఇల్లీగల్ నిర్మాణాలను వదిలేస్తూ జేబులు నింపేసుకుంటున్నారు. 'అనేవాళ్లు అంటూనే ఉంటారు.. మనం చేసే పని చేసుకుందాం' అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుతో విచ్చలవిడిగా బహుళ అంతస్థుల భవనాలు వెలుస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ వందల సంఖ్యలో నూతన భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఉన్న స్థలానికి, కడుతున్న నిర్మాణాలకు ఎక్కడా పొంతన లేదు. స్థలం తక్కువైనా సెల్లార్లు తవ్వేసి 7, 8 అంతస్థుల నిర్మాణాలకు ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు. ఇల్లీగల్ గా కట్టుకుంటే పొయేది ఏముంది పోనీలే.. మాకు వచ్చేది మాకు వస్తుందిగా అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎవరికేం పోయేది లేకున్నా జీహెచ్ఎంసీ మాత్రం భారీగా తన ఆదాయాన్ని కోల్పోతోంది.
అక్రమాలు అనేకం..
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గత కొంతకాలంగా భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇన్నాళ్లు ఏదో ఒక కారణంతో ఆగిన నిర్మాణాలు సైతం ఇప్పుడు ఎంచక్కా పూర్తవుతున్నాయి. పర్మిషన్లు ఉన్నాయా..? లేదా..? అసలు అనుమతికోసం జీహెచ్ఎంసీలో అప్లై చేసుకున్నారా..? వారు అనుమతులు ఇచ్చారా అనే ప్రశ్నలకే తావులేకుండా యథేచ్ఛగా కట్టేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది చూసీచూడనట్టుగా వ్యవహరించడమే కాదు.. వారికి మేమున్నాం అంటూ భరోసా ఇస్తుండడం అక్రమార్కులకు మరింతగా ఊతమిస్తున్నట్లు అవుతుంది. శేరిలింగంపల్లి, చందానగర్, కూకట్ పల్లి సర్కిళ్ల పరిధిలోని పలు డివిజన్ లలో అనేక నిర్మాణాలు సాగుతున్నా కొన్నింటికే మాత్రమే అనుమతులు ఉన్నాయని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి పడుతున్నా.. ఏ లాభాపేక్ష కోసం సిబ్బంది అక్రమార్కులకు వంత పాడుతున్నారో అందరికీ తెలిసిందే..!
అక్కడ అన్నీ గాలిమేడలే..
మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, చందానాయక్ తండా, ఎన్ కన్వేషన్, సీజేఆర్ స్కూల్ ఏరియాలతో పాటు పలు కాలనీల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఒక్కటంటే ఒక్క నిర్మాణానికి కూడా అనుమతులు ఉండవు. ఆ స్థలాలన్నింటిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అయినా నిర్మాణాలు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పటికి దాదాపు 200ల వరకు కొత్త కట్టడాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు బిల్డర్లు, నిర్మాణదారులు ఏకంగా 7, 8 అంతస్తుల భవనాలు నిర్మించారు. అంతేకాదు కింద సెల్లార్లు, పైన పెంట్ హౌస్ లు కూడా కట్టారు. వీటిలో ఎక్కడా కనీస నిబంధనలు కూడా పాటించలేదు. అయినా ఈ విషయాలు అన్నీ తెలిసినా.. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మిన్నకుండి చోద్యం చూస్తున్నారు. జీహెచ్ఎంసీలో అధికారులు, సిబ్బంది చేతి వాటాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమ భవన నిర్మాణదారులు జోరుగా బహుళ అంతస్థుల భవనాలు కట్టేస్తున్నారు.
రూల్స్ డోంట్ కేర్..
జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ నిర్మాణాలు సాగించినా ఒకే రూల్ ఉంటుంది. వారు నిర్దేశించిన కొలతల ప్రకారమే నిర్మాణాలు సాగించాలి. కానీ మాదాపూర్ డివిజన్ లోని అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా, చందానాయక్ తండా, ఖానామెట్ ప్రాంతాల్లో మాత్రం అవేవీ ఉండవు. ఇక్కడ కొందరు బిల్డర్లు, నిర్మాణదారులదే ఇష్టారాజ్యం. వారికి ఎంతస్థలం ఉంది, దానికి పర్మిషన్లు ఏమున్నాయి అన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వారికి ఎన్ని అంతస్థులు కట్టుకోవాలి అనుకుంటే అన్ని కట్టేస్తున్నారు. పైగా పెంట్ హౌస్ ఉంటే ఖర్చుల కింద పనికి వస్తాయన్న ఆలోచనతో అక్రమ నిర్మాణాలపై పెంట్ హౌస్ లు కట్టేస్తున్నారు. ఇదంతా తెలిసినా జీహెచ్ఎంసీ సిబ్బంది కాసుల వేటలో వారి కళ్లకు ఇవేమీ కనబడడం లేదు. జోనల్ కమిషనర్ తో పాటు డీసీలు, టీపీఎస్ సిబ్బంది మాదాపూర్ లోని కొందరు బిల్డర్లకు కొమ్ముకాస్తున్నారని తీవ్ర విమర్శలు ఉన్నాయి. మాదాపూర్ లో చాలామంది బిల్డర్లకు చందానగర్ జీహెచ్ఎంసీ సిబ్బంది మీడియేటర్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో హైడ్రా ఓ ఇల్లీగల్ నిర్మాణాన్ని నేలమట్టం చేసినా ఆ తర్వాత ఎందుకో కానీ తిరిగి ఆవైపు దృష్టి పెట్టలేదు.
ప్రభుత్వ భూములు, పార్కులు ఎక్కడ..?
అయ్యప్ప సొసైటీ భూముల్లో 1982లో కొందరు వెంచర్ వేయగా ఆతర్వాత కూడా రీ లే అవుట్లు వేశారు. అలా ఒకే స్థలం పలుమార్లు చేతులు మారుతూ వచ్చాయి. ఇక్కడ అసలు ఓనర్లు ఎవరో, నకిలీ ఓనర్లు ఎవరో అన్నదానిపై తరచూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ భూములను పలువురు కబ్జాదారులు
చెరబట్టారు. సామాన్యుల భూముల్లో పాగా వేసిన వారు గతంలో లే అవుట్ లో ఉన్న పార్కులు, సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను కూడా కబ్జాలు చేశారు. దోబీ ఘాట్, ఆ సమీపంలోని కుంటతో ఆగని భూ భకాసురులు పార్కులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. అయినా అమ్యామ్యాలకు అలవాటు పడ్డ జీహెచ్ఎంసీ సిబ్బంది చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ స్థలాలను కాపాడుతున్నాం అని ఊదరగొడుతున్న హైడ్రా ఎందుకో కానీ అయ్యప్ప సొసైటీ అంటేనే హడలి పోతుంది.
జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలి: సీపీఎం నాయకుడు కె. కృష్ణ
గత కొంతకాలంగా చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, మియాపూర్ జేపీ నగర్, బీకే ఎంక్లేవ్ హఫీజ్ పేట్ డివిజన్ లలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నా, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా కనీస చర్యలు లేవు. టీపీఎస్ అధికారులు అవినీతిలో కూరుకుపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలి.








