1100 మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు

by Elthuri vijay kumar |

వినాయక నిమజ్జనాలతో జీహెచ్ ఎంసీ పరిధిలో పేరుకుపోయిన చెత్త

1100 మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు
X

1100 మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు

- వినాయక నిమజ్జనాలతో పేరుకుపోయిన చెత్త

- రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది

- అఫ్జల్ గంజ్ నుంచి లిబర్టీ వరకు క్లీనింగ్

దిశ, హైదరాబాద్ బ్యూరో : వినాయక నిమజ్జనం సందర్భంగా అఫ్జల్ గంజ్ నుండి లిబర్టీ వరకు రోడ్లపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది విస్తృతంగా తొలగించారు. సర్కిల్ 14 ఏఎంఓహెచ్ డాక్టర్ నక్క వెంకటరమణ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం, శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో వాహనాలు ఎంజే మార్కెట్‌ నుండే ప్రయాణం చేయడం, స్వచ్ఛంద సంస్థల ద్వారా అన్నప్రసాదాల వితరణ జరగడం వలన ఈ పరిధిలో వ్యర్థాలు అధికంగా పేరుకుపోయాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డాక్టర్ వెంకటరమణ తెలిపారు. శోభాయాత్ర కొనసాగుతున్నప్పటికీ భక్తులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా మాస్ క్లీనింగ్ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.

800 మంది సిబ్బంది,18 వాహనాలు, 3 జేసీబీలు

ఆదివారం తెల్లవారు జాము నుండే 800 మంది పారిశుధ్య సిబ్బంది విధుల్లోకి దిగారని తెలిపారు. ఒక్కో వాహనానికి 6 టన్నుల సామర్థ్యం ఉండే 18 వాహనాలు, 3 జేసీబీలు, స్వీపింగ్ యంత్రాల సహాయంతో మొత్తం 1100 మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై నుండి తరలించామన్నారు. అంతేకాకుండా ట్యాంకర్లలో తీసుకొచ్చిన నీటి సహాయంతో అన్నప్రసాదాల వ్యర్థాలను క్లీన్ చేసి దుర్వాసన, అపరిశుభ్రత రాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వినాయక నిమజ్జనం సమయంలోనే శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని డాక్టర్ నక్క వెంకటరమణ స్పష్టం చేశారు.

Next Story