జైపూర్‌కు పోటీగా హైదరాబాద్.. వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే యోచన

by Ramesh Naini |   (  Updated:2026-04-28 15:32:48  IST  )

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

జైపూర్‌కు పోటీగా హైదరాబాద్.. వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే యోచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పన, గమ్యస్థానాల బ్రాండింగ్, విస్తృత ప్రచార కార్యక్రమాలకు సంబంధించి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగ‌ళ‌వారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిర్వహించిన పర్యాటక సలహా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సోమశిల, వరంగల్, రామప్ప, యాదాద్రి, గోల్కొండ, తారామతి బరాదరి, నాగార్జున సాగర్ వంటి కీలక పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాల‌ని మంత్రి ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు కనీస సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని మంత్రి అధికారులకు సూచించారు.

హైదరాబాద్ లో కార్నివాల్..

సలహా కమిటీ సమావేశంలో వెల్లడైన ప్రతిపాదనలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని, అమలు ప్రక్రియలో జాప్యం జరగకుండా ఒక నిర్దిష్ట పని లేదా ప్రాజెక్ట్ బాధ్యతను పర్యవేక్షించడానికి నోడల్ అధికారికి అప్ప‌గించాల‌ని సూచించారు. దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నవంబరు లేదా డిసెంబరు మాసాల్లో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్‌ నిర్వహణ‌కు అధ్య‌య‌నం చేయాలని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌త్రిపాద‌న‌లు రూపొందించి, స‌మ‌ర్పించాల‌ని చెప్పారు. ప్రారంభంలో ప్రభుత్వమే దీనిని చేపట్టినా, భవిష్యత్తులో ప్రైవేటు భాగస్వామ్యంతో స్వయం సమృద్ధిగా సాగేలా చూడాలని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఏండీఏ స‌మ‌న్వ‌యంతో నగర సుందరీకరణలో భాగంగా శిల్పాలు, ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌, స్కై వాక్ లు సృజనాత్మక ఉట్టిప‌డేలా తీర్చిదిద్దాల‌ని ఉద్భోదించారు.

వీకెండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్..

పర్యాటకులను ఆక‌ట్టుకునేలా ప్రధాన ప‌ర్యాట‌క కేంద్రాల్లో క్రమం తప్పకుండా వారాంతపు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్పెష‌ల్ సీఎస్ వాణి ప్ర‌సాద్ మాట్లాడుతూ, మ‌న రాష్ట్రంలో అద్బుత‌మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు, వ‌న‌రులు ఉన్నప్ప‌టికీ, ప్ర‌చారంలో వెనుక‌బ‌డి ఉన్నామని, దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పెండింగ్ లో ఉన్న హ‌రిత హోట‌ళ్ల నిర్మాణం పూర్తికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వారసత్వ కట్టడాల నిర్వహణ కోసం 'ఆగాఖాన్' మోడల్‌లో ట్రస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ‌ను అంతర్జాతీయ స్థాయిలో వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడంతో పాటు మెడికల్, వెల్నెస్, గోల్ఫ్, ఫిలిం, ఎకో టూరిజం కేంద్రంగా ప్రచారం చేయాలని కమిటీ సభ్యులు ప్రతిపాదించారు. రాష్ట్రంలో ఉన్న ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను అద్బుత కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చైనా, వియ‌త్నాం వంటి దేశాల్లో అధ్యయన పర్యటనలు చేపట్టాలని, జైపూర్ సిటీతో పోటీ ప‌డేలా హైద‌రాబాద్ తో పాటు ఇత‌ర ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్స‌గా తీర్చిదిద్ద‌డం, కేరళ తరహాలో ప్రకృతి ఉత్పత్తులు, సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌డం, ఈత‌, తాటి క‌ల్లు, ఇత‌ర ఉప ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హిస్తూనే బ్రాండింగ్ చేయ‌డం, వారసత్వ విధానం (హెరిటేజ్ పాలసీ) ఉండాలని, స్వదేశీ పర్యాటకంపై దృష్టి పెట్టి ప్ర‌చారానికి నిధులు కేటాయించాలని ప్ర‌తిపాదించారు. వరంగల్, సోమశిల వంటి ప్రాంతాల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో 3 నుండి 5 స్టార్ హోటళ్లను నిర్మించ‌డం, బమ్మెరలో పోతన స్మృతివనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాల‌ని, వ‌రంగ‌ల్ హ‌రిత హోట‌ల్ నుంచి రామ‌ప్ప వ‌ర‌కు బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డ‌పాల‌ని క‌మిటీ స‌భ్యులు సూచించారు. ఈ సమావేశంలో ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్ట‌ర్ గౌత‌మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story