తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

by Gantepaka Srikanth |

మూసీ నది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.

తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ నది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) డిస్పోజ్ చేసింది. దీంతో మూసీ ప్రక్షాళన పనులకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయినట్లయింది. అయితే, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని కార్తీక్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యూనల్ పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ఎన్జీటీ పేర్కొంది.

కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోలేమని, పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ట్రిబ్యూనల్ అభిప్రాపడుతూ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా నేషల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనుల్లో వేగం పెంచే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూసీ నదిలో మురుగునీరు కలవకుండా ఎస్టీపీ (ఎస్టీపీ)ల నిర్మాణం, నది పరివాహక ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్, చెక్ డ్యామ్‌ల ఏర్పాటు వంటి పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ వేసిన విషయం తెలిసిందే.

Next Story