ఉద్యాన పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి : రైతు కమిషన్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో ఉద్యాన వన పంటలు, మిల్లెట్ సాగు గణనీయంగా పడిపోయిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యాన పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి : రైతు కమిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో ఉద్యాన వన పంటలు, మిల్లెట్ సాగు గణనీయంగా పడిపోయిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది రైతులు ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్క జొన్న వైపు మొగ్గు చూపుతున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో పంటల మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని, చిరుధాన్యాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు అటు వైపు మొగ్గు చూపాలని కోరారు. సోమవారం రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో రాష్ట్రంలో పంటల మార్పిడి విధానం, భవిష్యత్ వ్యవసాయ ప్రణాళికలు, రైతుల ఆదాయాభివృద్ధికి సంబంధించిన తుది నివేదిక రూపొందించే అంశంపై వివిధ రంగాల నిపుణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న పంటల విధానం, నీటి లభ్యత, భూసార పరిస్థితులు, మార్కెట్ డిమాండ్, రైతుల ఆర్థిక స్థితి తదితర అంశాలను చర్చించారు. ముఖ్యంగా పంటల మార్పిడి ద్వారా రైతుల ఆదాయం పెంపు, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, భూసార పరిరక్షణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను రూపొందించడం వంటి అంశాలపై విస్తృతంగా డిస్కస్ చేశారు.

ఉద్యాన పంటల విస్తరణ, మిల్లెట్లు, పప్పు దినుసుల సాగును ప్రోత్సహించడం, రైతులకు మార్కెట్ ఆధారిత పంటలపై అవగాహన కల్పించడం, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విషయాలపై నిపుణులు పలు సూచనలు చేశారు. గ్రామీణ స్థాయిలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, సాగు ఖర్చులను తగ్గించే సాంకేతిక పద్ధతులను ప్రోత్సహించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను రూపకల్పన చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు. సమావేశంలో వచ్చిన సూచనలు, సిఫారసులను సమగ్రంగా పరిశీలించి తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, మరికంటి భవానీ రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అజేయ కల్లం, వి. నాగిరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి హాజరై తమ విలువైన సూచనలు అందించారు.

Next Story