- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హిల్ట్’ పాలసీ గైడ్‌లైన్స్ విడుదల.. నగరంలోని పారిశ్రామిక భూములకు సరికొత్త రూపు
హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీ గైడ్‌లైన్స్ విడుదలయ్యాయి. కన్వర్షన్ కోసం మంత్రి శ్రీధర్ బాబు పోర్టల్ ప్రారంభించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ కార్యరూపంలోకి వచ్చింది. హిల్ట్ పాలసీ పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పాలసీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పాలసీ కింద లబ్ధి పొందాలనుకునే పరిశ్రమలు, యూనిట్లు నూతనంగా ప్రారంభించిన పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. అలాగే స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చని, ఇది పారదర్శకత, సాంకేతిక ఆధారిత పరిపాలన పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్న సుమారు 9,292 ఎకరాల పరిశ్రమల భూమి మార్పిడి లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించింది.
బహుళ వినియోగ జోన్లుగా మార్పు..
హైదరాబాద్ నగర విస్తరణ కారణంగా నివాస ప్రాంతాల మధ్యలోకి వచ్చేసిన పాత పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కులు, ఆటోనగర్‌లలోని భూములను ‘మల్టీ-యూజ్ జోన్లు’గా మార్చుకోవడానికి అనుమతిస్తారు. ఈ భూముల్లో రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, కమర్షియల్ ఆఫీసులు, ఐటీ పార్కులు, మాల్స్, హోటళ్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. పాలసీ కింద ఓఆర్ఆర్ లోపల, దాని సమీపంలో ఉన్న సుమారు 22 పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించారు. దాదాపు 9,292 ఎకరాల భూమి ఈ పరిధిలోకి వస్తుంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిధిలోని పారిశ్రామిక పార్కులతో పాటు అక్కడ ఉన్న స్వతంత్ర పారిశ్రామిక యూనిట్లకు కూడా ఇది వర్తిస్తుంది.
రెండు టీమ్‌లుగా పారిశ్రామిక ప్రాంతాలు..
22 పారిశ్రామిక ప్రాంతాలను టీమ్-1, టీమ్-2గా విభజించారు. వాటికి స్క్రూటినీ కమిటీలను కేటాయించారు. టీమ్-1లో నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, మౌలాలీ, ఉప్పల్, సనత్‌నగర్, మేడ్చల్, కుషాయిగూడ, పటాన్‌చెరు, హయత్‌నగర్, స్వతంత్ర పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి. టీమ్-2లో కూకట్‌పల్లి, జీడిమెట్ల, ఎస్‌వీసీఐఈ జీడిమెట్ల, బాలానగర్, టీఐఈ బాలానగర్, ఎస్‌వీసీఐఈ బాలానగర్, గాంధీనగర్, పాషమైలారం, రామచంద్రాపురం, చందులాలబారాదరి, కాటేదాన్ ఉన్నాయి.
డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు..
పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు మార్చుకునేందుకు ప్రభుత్వం ఒకేసారి చెల్లించేలా నిర్దిష్ట రుసుములను ఖరారు చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం భూమి విలువ ఆధారంగా ఫీజు ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండేందుకు నూతనంగా ప్రారంభించిన అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులను స్వీకరిస్తారు. దీనికి నోడల్ ఏజెన్సీగా టీజీఐఐఈసీ వ్యవహరిస్తుంది. ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలనుకునే పారిశ్రామిక యజమానులు.. పాలసీ అధికారిక ఉత్తర్వులు వెలువడిన 6 నెలల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పాలసీ ద్వారా వసూలైన ఇంపాక్ట్ ఫీజులో 25 శాతం నిధులను టీజీఐఐఈసీ ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయిస్తారు.
ప్రాసెసింగ్ ఫీజు ఇలా..
ఒక ఎకరానికి - రూ.20 వేలు
ఎకరం నుంచి 5 ఎకరాల వరకు - రూ.50 వేలు
5 నుంచి 10 ఎకరాల వరకు - రూ.లక్ష
10 నుంచి 25 ఎకరాల వరకు - రూ.2 లక్షలు
25 నుంచి 50 ఎకరాల వరకు - రూ.5 లక్షలు
50 ఎకరాలు, ఆపైన ఉంటే - రూ.10 లక్షలు






