అర్ధరాత్రైనా విచారణకు రావాల్సిందే.. ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం

by Kema Shiva Kumar |

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కేసు విచారణలో భాగంగా తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అర్ధరాత్రైనా విచారణకు రావాల్సిందే.. ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి (Finance Secretary) తీరుపై రాష్ట్ర హైకోర్టు (High Court) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణకు ఆర్థిక శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలోనే ఆదేశించినప్పటికీ, ఆయన హాజరుకాకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, ఆ పనుల్లో నిమగ్నమై ఉండటం వల్లే ఫైనాన్స్ సెక్రటరీ విచారణకు రాలేకపోయారని కోర్టుకు వివరించారు. ఈ కారణంతో ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే, ఈ విన్నపాన్ని హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లేదు..

న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడంపై ధర్మాసనం నిప్పులు చెరిగింది. ‘రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదు. కోర్టు ఆదేశించినా అధికారి రాకపోవడం ఏంటి?’ అని ప్రశ్నించింది. తాము ఇవాళ అర్ధరాత్రి వరకు కోర్టు హాలులోనే ఉంటాం.. కానీ ఫైనాన్స్ సెక్రటరీ మాత్రం ఇవాళ ఖచ్చితంగా విచారణకు హాజరుకావాల్సిందేనని కోర్టు పేర్కొంది. ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి ఎలాంటి మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

కాగా, రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ (Gratuity), జీపీఎఫ్ (GPF), లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (Leave encashment) వంటి ప్రయోజనాలు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. తమ జీవితకాలపు పొదుపు మొత్తాల కోసం వృద్ధాప్యంలో కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోర్టు స్పందిస్తూ ఆర్థిక శాఖను వివరణ కోరింది. ఈ క్రమంలోనే మరికాసేపట్లో ఫైనాన్స్ సెక్రటరీ కోర్టు ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో కోర్టు ఎలాంటి కీలక ఆదేశాలు జారీ చేస్తుందోనని ఆసక్తికరంగా మారింది.

Next Story