హైదరాబాద్ లో.. దంచి కొట్టిన వాన!

by Geesa Chandu |   (  Updated:2024-08-16 15:08:19  IST  )

హైదరాబాద్ నగరంలో గురువారం (ఆగస్టు 15) వాన దంచి కొట్టింది.

హైదరాబాద్ లో.. దంచి కొట్టిన వాన!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో గురువారం (ఆగస్టు 15) వాన దంచి కొట్టింది. అతి తక్కువ సమయం రెండు గంటల వ్యవధిలోనే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో సిటీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధిక వర్షం వలన రోడ్లపై కొన్ని చోట్ల మోకాళ్ల లోతువరకు, మరికొన్నిచోట్ల నడుం లోతువరకు నీరు చేరడంతో.. జనాలు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సిటీలోని స్థానిక వనస్థలిపురంలోని పనామా వద్ద రెండు కార్లు, ఒక బైక్ పూర్తిగా మునిగిపోయాయి. దాదాపు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి, పలు కాలనీల్లో ఇంట్లోకి నీరు ప్రవేశించడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్న స్వాతంత్య్ర దినోత్సవం కావటం, దీంతో చాలా మంది ప్రజలు బయటే ఉండడంతో.. వాన నీటిలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే గురువారం సిటీలో అత్యధికంగా బన్సీలాల్ పేట్ లో 8.75 సెంటీ మీటర్లు, పాటిగడ్డ లో 8.53, సరూర్ నగర్ లో 8.35, ముషీరాబాద్ లో 8.05, హిమాయత్ నగర్ లో 6.95, సైదాబాద్ , ఆర్సీపురం లలో 6.88 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది.

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్టుగా ఉండాలి: పొన్నం

సిటీలో భారీ వర్షాల నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అధికార బృందాలు మరియు విద్యుత్ విభాగాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని తెలిపారు.

Next Story