- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్‌లో భారీ వర్షం.. ముంచెత్తిన వరద
నగర వ్యాప్తంగా శుక్రవారం కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నడుం లోతు వరద ఇళ్లను ముంచెత్తింది.

- నీట మునిగిన పలు ప్రాంతాలు
- హైడ్రా కమిషనర్ పర్యటన
- ప్యాట్నీ నాలా వద్ద ముంచెత్తిన వరద
- ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించిన హైడ్రా
దిశ, తెలంగాణ బ్యూరో: నగర వ్యాప్తంగా శుక్రవారం కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నడుం లోతు వరద ఇళ్లను ముంచెత్తింది. ప్యాట్నీ నాలా పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లు కూడా రంగంలో దిగి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయయి. మాసబ్ ట్యాంక్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజులరామారం, కూకట్పల్లి, హఫీజ్‌పేట్ వంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచినట్లు హైడ్రా కంట్రోల్ రూంకు సమాచారం అందింది.
కాలనీలను ముంచెత్తిన ప్యాట్నీ నాలా..
ప్రతి ఏటా వర్షాకాలం తమ కాలనీలు నీట మునుగుతున్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో ప్యాట్నీ నాలా విస్తరణకు హైడ్రా చర్యలు తీసుకుంది. అయితే ఓ ఇంటి యజమాని పనులను అడ్డుకోవడంతో ఆగిపోయాయి. దీంతో గతంలో మాదిరే సమస్య తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్లలో చిక్కున్న వారిని డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్ ప్యాట్నీ నాలా పరిసర ప్రాంతాల్లో బోటులో పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను పర్యవేక్షిస్తున్నారు.
బతుకమ్మ కుంటలోకి వరద నీరు..
అంబర్‌పేటలో బతుకమ్మ కుంటకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గతంలో వరద నీటితో లోతట్టు ప్రాంతాలు నీట మునిగేవని.. ఇప్పుడు చెరువు ఆ వరదను ఆపుతోందని స్థానికులు చెబుతున్నారు. భారీ మొత్తంలో వరద నీరు బతుకమ్మ కుంటకు చేరుతోందంటున్నారు.
నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - మేయర్, డిప్యూటీ మేయర్
వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశాలు
భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సాయం కోసం జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ 040-21111111 నంబర్ కు కాల్ చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం మొదలైన వర్షం గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురిసింది. ఈ నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి గురువారం నగరవాసులను అప్రమత్తం చేయడంతోపాటు, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు ఉన్నాయని, అత్యవసరమైతేనే బయటకు రావాలని లేదంటే ఇంటికే పరిమితం కావాలని సూచించారు. నగరవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మాన్‌సూన్ ఎమర్జెన్సీ, హైడ్రా బృందాలు ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఆమె ఆదేశించారు. రోడ్డుపై నిలిచిన నేటి లో వృద్దులు, పిల్లలను అదే విధంగా నాలా వద్దకు వెళ్లకుండా చూడాలని కోరారు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయవద్దని మేయర్ నగర్ వాసులను కోరారు.అపద సమయంలో జీహెచ్ఎంసీ హెల్ప్ నంబర్ గాని హైడ్రా హెల్ప్ నంబర్ 90001 13667ను సంప్రదించాలని మేయర్ కోరారు.
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం
హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.






