‘కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లారా జాగ్రత్త.. వడ్డీతో సహా చెల్లిస్తాం’: హరీష్ రావు హెచ్చరిక

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లారా జాగ్రత్త.. వడ్డీతో సహా చెల్లిస్తాం’: హరీష్ రావు హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు సమక్షంలో పలువురు బీజేపీ(BJP) నుంచి బీఆర్ఎస్‌(BRS)లో చేరారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. ఉద్యమకారుడు తానాజీ బీజేపీకి వెళ్లి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత వచ్చేసింది. మల్లొచ్చే ప్రభుత్వం ఏదని ఎవరిని అడిగినా బీఆర్ఎస్ పక్కా అని అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయింది, ఉన్నది ఇంకా రెండేళ్లు మాత్రమే.. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. బీజేపీ దేశం కోసం ధర్మం కోసం అంటూ డైలాగులు కొట్టడం తప్ప.. బీజేపీపేదలు, దళితుల పక్షాన ఉండదని అన్నారు. కేవలం నార్త్ ఇండియా వైపే ఉంటుందని చెప్పారు.

తెలంగాణ ఇండియాలో లేదా? అసలు తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణకు శ్రీరామరక్ష అంటే బీఆర్ఎస్ పార్టీనే అన్నారు... జాతీయ పార్టీలు తెలంగాణకు అన్ని విధాల అన్యాయాలే చేస్తాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచి ఉంటే ఢిల్లీలో బీజేపీ మెడలు వంచి నిధులు తీసుకొచ్చే వాళ్లం.. కానీ.. ఇక్కడి బీజేపీ నేతలకు చేతగావడం లేదని విమర్శించారు. 157 మెడికల్ కాలేజీలను కేంద్రం ప్రకటిస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణకు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. వరదల వల్ల పంటనష్టపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. తొందర్లో కాంగ్రెస్ బాకీ కార్డులు నియోజకవర్గానికి వస్తాయి.. ప్రతి ఇంటికి బాకీ కార్డులను చేర్చాలని నేతలకు సూచించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) అంటే చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అని విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్లను అరెస్టు చేస్తున్నారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లారా జాగ్రత్త.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని హరీష్ రావు ధైర్యం చెప్పారు.

Next Story