రాజకీయాలు పక్కనబెట్టి ముందు వారి సమస్య తీర్చు.. CM రేవంత్‌కు హరీశ్ రావు విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

సమస్యలు పరిష్కరించాలంటూ జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ గురుకుల విద్యార్థులు(Gurukula Students) చేస్తున్న పాదయాత్రపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) స్పందించారు.

రాజకీయాలు పక్కనబెట్టి ముందు వారి సమస్య తీర్చు.. CM రేవంత్‌కు హరీశ్ రావు విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: సమస్యలు పరిష్కరించాలంటూ జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ గురుకుల విద్యార్థులు(Gurukula Students) చేస్తున్న పాదయాత్రపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

‘స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం పాదయాత్ర చేయడం కాదు.. గురుకుల పిల్లల పాదయాత్రపై దృష్టి సారించాలి. దిగజారుతున్న గురుకుల వ్యవస్థను కాపాడాలి. ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే రేవంత్ రెడ్డి గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతారు. పరిపాలన గాలికి వదిలేసి, అనునిత్యం రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం అమానవీయం. తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత విద్యార్థులను నడిరోడ్డు ఎక్కించిన దుర్మార్గ చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. చదువుకోవాల్సిన పిల్లలను పట్టెడు అన్నం కోసం, తాగు నీళ్ళ కోసం పాదయాత్రలు చేసే దుస్థితి కల్పించింది నీ అసమర్ధ పాలన. మాకు న్యాయం కావాలని అన్నందుకు పోలీసులను పెట్టి, బలవంతంగా డీసీఎంలలో విద్యార్థులను తరలించిన నీచమైన చరిత్ర ఈ ఇందిరమ్మ రాజ్యానిది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, సమస్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక అడిగినా ప్రభుత్వంలో చలనం కలుగదా?. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు.. మీ పాలనలో రోజు రోజుకీ పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం మరోసారి పాదయాత్ర డ్రామాలు మొదలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ.. గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రల మీద ముందు దృష్టి సారించాలి’ అని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

Next Story