- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదేనా రాజ్యాంగాన్ని కాపాడే మీ నైతికత? రాహుల్ గాంధీని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్ రావు
దానం నాగేందర్కు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు ఘాటుగా లేఖ రాశారు. రాజ్యాంగ నైతికతపై నిలదీశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు (Danam Nagender) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సమర్ధిస్తారా? లేక చర్యలకు ఆదేశిస్తారా? అని ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి (Rahul Gandhi) మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని బలోపేతం చేస్తామని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి.. రాజ్యాంగాన్ని చేతబట్టి దేశవ్యాప్తంగా నీతిసూత్రాలు చెప్పిన మీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షించడం అంటే ఇదేనా? దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బోధించే రాజ్యాంగ నైతికత ఇదేనా అని ప్రశ్నించారు.
ఇంతకంటే ఆధారం ఇంకేం కావాలి?:
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అవకాశవాదం కోసం వాడుకుంటున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్(BRS) టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇచ్చిన B-Formతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది ఊహాగానమో, వదంతో కాదు. ఇది ప్రజా రికార్డుల్లో ఉన్న నిజం. అయినా కూడా దానం పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు తెలంగాణలో మీ పార్టీకి చెందిన శాసనసభ స్పీకర్ చెబుతున్నారు. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరో పార్టీ B-Formపై ఎన్నికల్లో పోటీ చేయడం కూడా ద్రోహానికి ఆధారం కాకపోతే, పదో షెడ్యూల్ (Tenth Schedule) ప్రకారం ద్రోహానికి ఆధారం అంటే అర్థం ఏంటో దేశం మొత్తం తెలుసుకోవాల్సిన ప్రశ్నగా మిగిలిపోయిందన్నారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడే విధానం? దేశానికి మీరు బోధించే రాజ్యాంగ నైతికత ఇదేనా? అని నిలదీశారు.
ప్రసంగాలతో రాజ్యాంగాన్ని కాపాడలేరు:
ఒక పార్టీ టికెట్‌పై ఎన్నికైన శాసనసభ్యుడు, మరో పార్టీ జెండా కింద ఎన్నికల్లో పోటీ చేసి కూడా ఎమ్మెల్యేగా కొనసాగితే రాజ్యాంగ ఆత్మ కేవలం రాజకీయ నినాదంగా మారిపోతుందన్నారు. ఢిల్లీలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పి, తెలంగాణలో దాన్ని బలహీనపరచడం ఎలా సమర్థించగలరు? అని నిలదీశారు. అందువల్ల విప్ మార్పిడి చట్టం ప్రకారం దానం నాగేందర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి, స్పీకర్‌కు మీరు సూచిస్తారా? లేకపోతే, కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడటం రాజకీయ ప్రయోజనం ఉన్నప్పుడేనా అని దేశం భావించాలో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలు, అలాగే దేశ ప్రజలు నిజాయితీగల సమాధానాన్ని ఆశిస్తున్నారని రాజ్యాంగాన్ని కేవలం ప్రసంగాలతో కాపాడలేమన్నారు.






