- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: వదిలిపెట్టను.. అసెంబ్లీలో తప్పకుండా నిలదీస్తా: హరీష్ రావు
ప్రైవేట్ కంపెనీలతో ఏకంగా 2,000 బస్సుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని.. విద్యుత్ బస్సుల ముసుగులో సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకున్నదని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ కంపెనీలతో ఏకంగా 2,000 బస్సుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని.. విద్యుత్ బస్సుల ముసుగులో సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకున్నదని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని స్పష్టం చేశారు. మంగళవారం టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు హరీశ్‌రావును కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన నిలబడి, వారి సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి, కార్మికులకు చేస్తున్న అన్యాయంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను కాపాడుకోవాలని కార్మికులు పోరాడుతుంటే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీరో టికెట్ అమలు కోసం ప్రతినెలా రూ.350 కోట్లు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు అరకొర నిధులు చెల్లించి చేతులు దులుపుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇప్పటికీ రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉండగా, 2025 పీఆర్సీ సైతం అమలుకు నోచుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే రూ.2,804 కోట్ల బకాయిలను విడుదల చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులపై రేవంత్‌కు ఎందుకు చిన్న చూపు?
రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకంత చిన్న చూపు అని హరీశ్‌రావు ప్రశ్నించారు. తమ సమస్యలపై గురువారం తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున హరీశ్‌రావును కలిశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా సేవలందించి, రిటైర్డ్ అయ్యాక బెన్‌ఫిట్స్ ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమని.. తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ తీరు వల్ల బెన్ఫిట్స్, పెన్షన్ బకాయిలు రాక మనోవేదనకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ బ్యూటిఫికేషన్ కోసం లక్షన్నర కోట్లు, ఫ్యూచర్ సిటీ కోసం లక్ష కోట్లు, అందాల పోటీల కోసం వందల కోట్లు, తన సోకుల కోసం నిర్వహించే ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రూ.100 కోట్లు, సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం వందల కోట్లు, వివిధ రాష్ట్రాల్లో వందల కోట్లతో పత్రిక ప్రకటనలు ఇచ్చే రేవంత్‌రెడ్డికి ఈ బకాయిలు గుర్తుకురాకపోవడం దారుణం అన్నారు.కమీషన్లు రావు కాబట్టే వీరికి బకాయిలు చెల్లించడం లేదన్నారు.






