- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: బనకచర్లపై లోకేశ్ వ్యాఖ్యలు.. హరీశ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
బనకచర్లపై లోకేశ్ చేసిన వ్యాఖ్యల విషయంలో హరీశ్ రావు రియాక్ట్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్ తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే దీన్ని అడ్డుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెదవులు మూసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ ప్రభుత్వం బనకచర్ల కడతామంటే కదా నేను అడ్డుకునేది అని మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు. కానీ ఇప్పుడు లోకేశ్ మాత్రం ఎవరు అడ్డొచ్చినా బనకచర్ల కట్టితీరుతామంటున్నారు. లోకేశ్ ఏ ధైర్యంతో బనకచర్లపై బరితెగించి మాట్లాడుతున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి గురదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నారని.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డూడూబసవన్నలుగా తలూపడం వల్లే లోకేశ్ ఆ రకంగా మాట్లాడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉందనే ధైర్యంతోనే లోకేశ్ ఈ తరహా మాట్లాడుతున్నారు. ఓ వైపు లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టును కట్టితీరుతామని మాట్లాడుతుంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టే రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం అర్థం అవుతున్నదన్నారు. గోదావరి-బనకచర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్ కే రామని సీఎస్ లేఖ రాస్తే ముఖ్యమంత్రి రాత్రికి రాత్రే ఢిల్లీ వెళ్లి సమావేశంలో పాల్గొని కమిటీ ఏర్పాటుకు ఒప్పుకున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి, బీజేపీ సహకరించడం వల్లే ఏపీ ఈ అంశంలో ముందుకెళుతోందన్నారు.
లోకేశ్ వి అవగాహన లేని మాటలు:
సాగునీటి అంశాలపై అవగాహన లేకుండా లోకేశ్ మాట్లాడుతున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. యంగ్ స్టార్ గా ఉన్న లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడుతూ మీ భవిష్యత్ ను చెడగొట్టుకుంటున్నారు. అంతర్రాష్ట్ర వ్యవహరాల విషయంలో మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. అధికారం ఉందని, మందబలం, కేంద్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మా చేతిలో ఉందని ఏది మాట్లాడితే అది చెల్లుతుంది అనుకుంటే పొరపాటు అన్నారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నది నిజమే అయితే కేంద్రం మీ డీపీఆర్ ను ఎందుకు తిప్పిపంపారని ప్రశ్నించారు. నీళ్లు ఉన్నాయనేది నిజమే అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన నాలుగు సంస్థలు మీ గోదావరి బనకచర్ల డీపీఆర్ ను ఎందుకు తిరస్కరించారు. నీళ్లు ఉన్నాయని ఎవరు తేల్చారు? నీళ్లు ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత? ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు లేవని లోకేశ్ మాట్లాడుతున్నారు. మేమేమైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లుపెట్టి నీళ్లు తరలించుకుపోతున్నామా అని మాట్లాడుతున్నారు. చిల్లు పెట్టడానికి కాళేశ్వరం ఏమైనా శ్రీశైలం ప్రాజెక్టా? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? లేదా ఇదేమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశా అని మండిపడ్డారు.
కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని ఎత్తిపోతల ప్రాజెక్టుకు చిల్లుకొట్టుడు ఉండదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, తెలుగు దేశం నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల ఆ నాడు మీరు ఆడిందే ఆటా పాడిందే పాట సాగిందన్నారు. కానీ ఇవాళ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ అని ఇప్పుడు ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఉమ్మడి ఏపీలో నడిచినట్లుగా చిల్లు కొడతామంటే ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని లోకేశ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మీకు తెలియకుంటే మీ నాన్నను అడగాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాక నాటి తెలుగు దేశం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి 7 లేఖలు రాశారన్నారు. బనకచర్లను మేము అడ్డుకుని తీరుతామన్నారు.






