Harish Rao: రైతులకు రూ. 14 వేల కోట్లు కాంగ్రెస్ సర్కార్ ఎగ్గొట్టింది: హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-04-12 05:26:44  IST  )

వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు సైతం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Harish Rao: రైతులకు రూ. 14 వేల కోట్లు కాంగ్రెస్ సర్కార్ ఎగ్గొట్టింది: హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు సైతం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు యాసంగి రైతుబంధు కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం రాజ్ గోపాల్‌పేట్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల, వడ గండ్ల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను హరీష్ రావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వడగండ్ల వానతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని తెలిపారు. నంగునూరు మండలంలో 11 గ్రామాల్లో దాదాపు 5,300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఒక సిద్దిపేట జిల్లాలోనే 10 వేల ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. 2500 ఎకరాల హార్టికల్చర్ పంటలు కూడా నష్టపోయాయని తెలిపారు.

ఇక, రుణమాఫీ కాలేదు రైతుబంధు పడలేదని రాగుల బాలయ్య అనే రైతు బాధలో ఉన్నారని తెలిపారు. వానకాలం రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారని, యాసంగి సగం మందికి వేశామన్నారు ఆ సగం మందికి కూడా పూర్తిగా రైతుబంధు రాలేదన్నారు. నాడు కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ రైతుబంధు డబ్బులు పడ్డాయని, ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నెంబర్లలో అద్దెకరం, పావు ఎకరం ఎక్కువ ఉందనే సాకుతో రైతులకు రైతుబంధు ఆపారని ఆరోపించారు. వానకాలం రూ. 9 వేల కోట్లు, ఈ యాసంగీ రూ. 5వేల కోట్లు, మొత్తం 14 వేల కోట్లు ప్రభుత్వం రైతులకు ఎగబెట్టిందన్నారు. రూ. 14 వేల కోట్లు రైతుబంధు ఎగ్గొట్టి వాటిని రుణమాఫీలో ఇచ్చినట్టు చూపిస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా (KCR) కేసీఆర్ రైతులకు రైతుబంధు ఆపలేదన్నారు. పంట బీమాకు సంబంధించి బడ్జెట్ లో డబ్బులు పెట్టి ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వంట నష్టపరిహారం ఎకరానికి రూ. 6 వేలు ఉంటే కేసీఆర్ పదివేలకు పెంచారని, పోయిన ఎండాకాలం సిద్దిపేట జిల్లాలో 1,350 ఎకరాల్లో వడగళ్ల వానకు పంట నష్టం జరిగిందన్నారు. ఈ 1350 ఎకరాలకు పంట నష్టం ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదన్నారు.

రైతు బీమా విషయంలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, చాలామంది చనిపోయిన రైతులకు రైతు బీమా అందడం లేదన్నారు. వెంటనే చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం సబ్సిడీ కింద విత్తనాలను అందుబాటులో పెట్టి రైతులకు సకాలంలో అందించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు వచ్చే వానకాలానికి విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కౌలు రైతుల గురించి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కౌలు రైతుకు రైతుబంధు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఇటు రైతు బంధు రాక ఇన్పుట్ సబ్సిడీ రాక కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story