రహస్యమేమీ లేదు.. ఢిల్లీ పర్యటనలపై కుండబద్దలు కొట్టిన హరీష్ రావు: సీఎం రేవంత్‌పై ఫైర్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రహస్యమేమీ లేదు.. ఢిల్లీ పర్యటనలపై కుండబద్దలు కొట్టిన హరీష్ రావు: సీఎం రేవంత్‌పై ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందించిన తీరును తప్పుబట్టిన ఆయన, రేవంత్ రెడ్డికి కడుపుమంట, అక్కసు తప్ప మరేమీ లేదని విమర్శించారు. తన ఢిల్లీ పర్యటనపై సీఎంవో నుంచి వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. నిన్నటి జగిత్యాల సభలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల గురించి అత్యంత హుందాగా మాట్లాడారని హరీష్ రావు పేర్కొన్నారు. జగిత్యాల, కాటారం సభలతో ప్రజలకు ఒక విషయం స్పష్టమైంది. తెలంగాణ కోసం తపించే కేసీఆర్ ఎవరో, చిల్లర మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఎవరో అందరికీ తెలిసిపోయింది అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన ఢిల్లీ పర్యటనపై సీఎంవో ఇచ్చిన లీకులను హరీష్ రావు కొట్టిపారేశారు. నా ఢిల్లీ పర్యటనలో ఎలాంటి రహస్యం లేదు. ఫిరాయింపుల కేసుపై న్యాయ నిపుణులతో చర్చించేందుకే ఢిల్లీకి వచ్చాను. అందరి కళ్లముందే శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విమానం ఎక్కాను తప్ప దొంగచాటుగా వెళ్లలేదు అని స్పష్టం చేశారు. రేపు సుప్రీంకోర్టులో 'ఓటుకు నోటు' కేసు విచారణ ఉందని, అందులో బీఆర్ఎస్ ఇంప్లీడ్ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రహస్య భేటీలు రేవంత్‌కే అలవాటు..

రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి చేస్తూ.. "రహస్య భేటీలు చేయడం నాకు అలవాటు లేదు. రాత్రి రాహుల్ గాంధీని కలిసి, ఉదయం కేంద్ర మంత్రులను, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను కలవడం రేవంత్ రెడ్డికే వెన్నతో పెట్టిన విద్య" అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. పనిలేని వారే తన పర్యటనలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Next Story