అవినీతిని నియంత్రించాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి

by Bhanu |

దేశవ్యాప్తంగా అవినీతి రోజురోజుకు పెరిగిపోతోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

అవినీతిని నియంత్రించాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి
X

దిశ, నల్లగొండ బ్యూరో : దేశవ్యాప్తంగా అవినీతి రోజురోజుకు పెరిగిపోతోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఎన్నికల ఖర్చుల నియంత్రణ లేకపోవడమే ఈ అవినీతి పెరుగుదలకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని సూచించారు.

ప్రజలకు ఉచిత పథకాల పేరుతో అనేక నిధులు ఖర్చవుతున్నాయని, దీనిపై నియంత్రణ అవసరమన్నారు. లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ నలిగిపోతుందని హెచ్చరించారు. అధికారుల అవినీతి, ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖలో వేల కోట్ల రూపాయలు అవినీతికి గురవుతున్నాయన్న విషయాన్ని గుత్తా ప్రస్తావించారు.

ఇటీవలి కాలంలో రాజకీయాల్లో భాషా వ్యవహారం తీవ్రంగా దిగజారిందని, ప్రతి నాయకుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో రాజకీయ నాయకులపై ఈసడింపు భావన పెరుగుతోందని, మాటల ద్వారా గౌరవాన్ని నిలుపుకోవాలని సూచించారు. శాసనమండలి సభ్యులు కవిత మరియు తీన్మార్ మల్లన్న మధ్య వివాదంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అంతేగాక, సాగర్ ఎడమ కాలువ ద్వారా తాగునీటిని ముందుగానే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి, నీటివనరుల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాలం ఇప్పటికే ప్రారంభమైందని, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం త్వరలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

Next Story