ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు

by Disha Web Desk 4 |
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు
X

దిశ, యాచారం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరాయి. మొదటినుంచి గ్రూపు తగాదాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇటీవల వర్గపోరు మరింత తీవ్రమైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ నేతలు ఎవరికి వారే వ్యవహరిస్తున్న తీరు.. నియోజకవర్గాల వారీగా వారిని సమన్వయం చేయడం పార్టీకి సవాల్‌గా మారింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మేల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పార్టీని నియోజకవర్గంలో ముందుండి నడిపిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ఆయన అభిమానులు కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. గత ఏడాది టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలు కూడా ఎవరికి వారుగా పోటాపోటీగా చేపట్టారు. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. దీంతో పార్టీలోని నాయకుల్లో, కార్యకర్తల్లో తీవ్ర అయోమయం నెలకొన్నది.

కొద్దిపాటి నాయకులు, కార్యకర్తలు కూడా నేతల మధ్య నెలకొన్న వర్గపోరుకు అయోమయానికి గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ ఉద్యోగాల కేసులకు వ్యతిరేకంగా రాష్ట్ర అధిష్ఠానం అన్ని నియోజకవర్గాల్లో సత్యాగ్రహ దీక్షలను చేపట్టాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రెండుచోట్ల పోటాపోటీగా దీక్షలను నిర్వహించారు.

ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి వర్గీయులు సత్యాగ్రహ దీక్షను నిర్వహించగా, ఆయన వ్యతిరేక వర్గమైన కిసాన్‌సెల్‌ రాష్ట్ర నాయకుడు కోదండరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకుడు శేఖర్‌గౌడ్‌, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, ఈ సత్యాగ్రహ దీక్ష తుర్కయంజాల్‌లో పోటాపోటీగా నిర్వహించడంతో కిందిస్థాయి నాయకులు ఎవరి దీక్షకు వెళ్లాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. మరికొంతమంది ఎక్కడికెళ్లకుండా ముఖం చాటేశారు.

హాథ్ సే హాథ్ జోడోయాత్ర

హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా నియోజకవర్గంలోనీ అన్ని మండలాల్లో పార్టీ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్ రెడ్డి రంగారెడ్డి పాదయాత్ర చేసి సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి హాథ్ సే హాథ్ జోడోయాత్ర చేపట్టారు. యాత్రను మర్రి నిరంజన్ రెడ్డి ముందుండి నడిపించారు. మర్రి వర్గంగా మాజీ ఎమ్మెల్యే, కిసాన్‌సెల్‌ రాష్ట్ర నాయకుడు కూడా ముదిరెడ్డి కోదండరెడ్డి వుండడం విశేషం, హాథ్ సే హాథ్ జోడోయాత్రలు నియోజక వర్గంలో చేపడతామని మర్రి ప్రకటించారు.

సీఎం, ఎమ్మెల్యే అంటూ కార్యకర్తల నినాదాలు

ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లిలో మర్రి నిరంజన్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రలో ఎంపీ అభిమానులు కోమటిరెడ్డిని సీఎం సీఎం, అని మర్రి నిరంజన్ రెడ్డిని ఎమ్మెల్యే అంటూ సభ ప్రాంగణంలో నినాదాలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి కల్పించుకొనీ అలా నినాదాలు చేయడం తగదని పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

అయోమయంలో కార్యకర్తలు

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బలంగా వున్నా, పార్టీలో నేతల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీలో ముందుండి నడిపించాల్సిన నాయకులు ఎక్కువవడంతో ఎవరి చెంతన వుండాలో దిక్కు తోచని స్థితిలో కార్యకర్తలు వున్నారు. ఇప్పటికైనా క్యాడర్‌ను ముందుండి నడిపించే బాధ్యత ఒక్కరు తీసుకుంటే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ కార్యకర్తలు గట్టిగా నమ్ముతున్నారు.



Next Story

Most Viewed