- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద వైభవంగా జయంతి వేడుకలు : మంత్రి లక్ష్మణ్ సమీక్ష
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది. ఈ నెల 14న జరగబోయే జయంతి వేడుకల ఏర్పాట్లను ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం, పరిసర ప్రాంతాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో సామాజిక న్యాయం, సమానత్వం, సంక్షేమం అనే మూడు సూత్రాల ఆధారంగా అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ జయంతి వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రానున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు, మొబైల్ టాయిలెట్స్, ప్రత్యేక శానిటేషన్ బృందాలు, అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులు, అంబులెన్స్‌లు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు, పార్కింగ్‌కు విస్తృత స్థలాల కేటాయింపు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ వంటి అన్ని అంశాల్లో సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం
అంబేద్కర్ జీవిత విశేషాలు, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, విద్యార్థులు, యువత కోసం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంబేద్కర్ వాదులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు యువత పెద్ద సంఖ్యలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు విచ్చేసి నివాళులు అర్పించనున్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లను చేపట్టినట్లుగా మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేలా తగిన చర్యలు చేపడుతున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలందరూ సౌకర్యవంతంగా పాల్గొనేలా ప్రతి అంశంలో నాణ్యత, సమయపాలన పాటించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, జయంతి ఉత్సవాల కమిటీ కో-చైర్మన్లు దొమ్మాటి సుదర్శన్ బాబు, మహేందర్, అనిల్, రోజారాణి, గంటా సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.






