సర్కారు సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాలి : భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |

తెలంగాణలో కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో సర్కారు సంక్షేమ, అభివృద్ధి విషయంలో తీసుకున్న నిర్ణయాలు గోల్డెన్​పీరియడ్​అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

సర్కారు సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాలి : భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో సర్కారు సంక్షేమ, అభివృద్ధి విషయంలో తీసుకున్న నిర్ణయాలు గోల్డెన్​పీరియడ్​అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గాంధీ భవన్లో మంగళవారం నిర్వహించిన పీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం విచ్చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంకాలంగా తీసుకున్న నిర్ణయాలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ హర్షం వ్యక్తం చేసిందని తెలిపారు. ముఖ్యంగా గోల్డెన్ పీరియడ్ అని అభినందించడం జరిగిందని పేర్కొన్నారు.

బూత్, మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ కార్యాచరణ రూపొందించాలని తీర్మానించిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి, కిందిస్థాయి వరకు తీసుకు వెళ్ళేందుకు ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని పీఏసీ నిర్ణయం తీసుకున్నదని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో రైతు భరోసాను రైతు బంధు అనేవారు. ఎన్నికల ముందు వారు ఒక సీజన్ కు రైతు భరోసా ఎగవేస్తే మేము వచ్చి చెల్లించామని స్పష్టం చేశారు.

పదేళ్లు అధికారంలో ఉండి, బీసీలకు మేలు జరిగే సర్వేలో పాల్గొనని వారు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీల కుల సర్వే గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమేనని అన్నారు. ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకువచ్చేందుకు బీసీల కుల గణన పై మొదట క్యాబినెట్లో తీర్మానం చేశామన్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం చేయించి, గవర్నర్​కు పంపామని, ఇది బీసీల కుల గణన పై కాంగ్రెస్​ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అని చెప్పారు. రాష్ట్రంలో రూ.22వేల కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని భట్టి తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గస్థానంలో 3వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

“రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10లక్షల వరకు వైద్య సదుపాయం అందిస్తున్నామని, దీంతో 94లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. రూ.6వేల కోట్ల విలువైన 189 కోట్లు ఉచిత బస్సు టికెట్లు ఇచ్చామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తున్నామన్నారు. 93.7 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తంగా కాంగ్రెస్​ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు రూ.95,351 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.

Next Story