సృజనాత్మకతకు పట్టం కడుతున్న ప్రభుత్వ పాఠశాలలు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కొందరు ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.

సృజనాత్మకతకు పట్టం కడుతున్న ప్రభుత్వ పాఠశాలలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కొందరు ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, భిన్నమైన పద్ధతుల ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచడమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా కృషి చేస్తున్నారు. అలాంటి కొన్ని ప్రభుత్వ స్కూళ్లపై దిశ ప్రత్యేక కథనం.

కథలు, ఉత్తరాలు, కవిత్వం

నల్లగొండ జిల్లాలోని తంగడపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. హెచ్ఎం ఈ చానల్ రూపొందించగా, ఉపాధ్యాయులు కలిసికట్టుగా పనిచేస్తూ విద్యార్థుల్లో భాషా నైపుణ్యం పెంచేందుకు ప్రార్థన సమయంలో హరివిల్లు పేరుతో కథలు చెప్పిస్తున్నారు. మంచు లక్ష్మి ఫౌండేషన్ ద్వారా స్మార్ట్ తరగతిని, దాతల సహకారంతో డిజిటల్ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు వినూత్న బోధన అందిస్తున్నారు. బడిలో నిర్వహించే వినూత్న కార్యక్రమాలను తమ పాఠశాల చానల్ ద్వారా ప్రజలందరికి తెలియజేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థుల్లో దాగి ఉన్న స‌ృజనాత్మకతను వెలికితీసేందుకు వారితో ఉత్తరాలు, కవిత్వం వంటివి రాయిస్తున్నారు. ‘అవ్వ- తాతలకు ఉత్తరం రాద్దాం..’ అనే కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు సహకారం అందిస్తున్నారు. ఉత్తరాలను ఉపాధ్యాయులతో కలిసి పోస్టాఫీసుకు వెళ్లి పోస్టు చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో బాగా రాసిన వారిని ముగ్గురిని ఎంపిక చేసిన బహుమతులు అందిస్తున్నారు.

ఆర్థిక క్రమశిక్షణకు బడి బ్యాంకు

పెద్దపల్లి జిల్లా సుల్తానబాద్ మండలం గర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బ్యాంకు నడిపిస్తున్నారు. విద్యార్థులు తమ పాకెట్ మనీని ఇందులో దాచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇది వారికి ఆర్థిక క్రమశిక్షణను నేర్పుతోంది. తల్లిదండ్రులు ఇచ్చిన నగదును పాఠశాల బ్యాంకులో జమ చేసుకుని రోజు 45 నిమిషాలు బ్యాంకు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పిల్లల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందిండానికి ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. విద్యార్థుల్లో బ్యాంకింగ్ సెక్టార్‌పై చిన్ననాటి నుంచే అవగాహన కల్పిస్తే ఆ అంశాలు వారి కెరియర్‌కు ఉపయోగపడతాయని అంటున్నారు. ఇందులో విద్యార్థులే బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తారు. చిన్ననాటి నుంచే ఫామ్ నింపడం, డిపాజిట్, విత్ డ్రా చేయడం, కేవైసీ చేయడం వంటి అంశాలు తమకు తెలిశాయని విద్యార్థులు చెబుతుండడం మంచి పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలు జంక్ ఫుడ్, దురలవాట్లకు గురికాకుండా పాకెట్ మనీ స్కూల్ బ్యాంకులో దాచుకోవడం మంచి పరిణామమని తల్లిదండ్రులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్ఎం ద్వారా కరెంట్ అఫైర్స్

కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థన సమయంలో ఎఫ్ఎం రేడియో ద్వారా నిత్యం తాజా వార్తలు, కరెంట్ అఫైర్స్ వినిపిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు, వారి సాధారణ విజ్ఞానం పెరుగుతుంది. ఈ వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో కమ్యూనికేషన్ సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతున్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక పద్ధతులు భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అంటున్నారు.

Next Story