తెలంగాణలోని గ్రామాలకు మహర్దశ.. రాబోయే నాలుగేళ్లు ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలుసా?

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. రాబోయే నాలుగేళ్లలో కొత్త రోడ్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, వెడల్పు లాంటి పనులు చేయాలని నిర్ణయించింది.

తెలంగాణలోని గ్రామాలకు మహర్దశ.. రాబోయే నాలుగేళ్లు ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. రాబోయే నాలుగేళ్లలో కొత్త రోడ్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, వెడల్పు లాంటి పనులు చేయాలని నిర్ణయించింది. నిధుల కొరత లేకుండా హైబ్రిడ్ అన్యూటి మోడల్ (హెచ్ఏఎం) అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది. వచ్చే మూడేళ్లలో రూ.25 వేల కోట్ల అంచనాతో పంచాయతీరాజ్ రోడ్లను 12 వేల కిలో మీటర్ల మేర కొత్తగా వేయండి, మరమ్మతులు, విస్తరణ పనులు చేపట్టనున్నారు. వచ్చే నెల 15 నుంచి ‘హ‌మ్’ విధానంలో ప‌నులు చేపట్టేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మొదటి విడతగా 30 ట‌న్నుల సామర్థ్యం గ‌ల వాహ‌నాలు వెళ్లేందుకు అనువుగా రోడ్లు నిర్మించడం, మరమ్మతులు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ‌ నిర్ణయం తీసుకున్నది.

మొదట 5 వేల కిలోమీటర్లకు టెండర్లు

ఏప్రిల్ మొద‌టి వారంలో ఐదు వేల కిలోమీట‌ర్ల గ్రామీణ రహ‌దారుల నిర్మాణానికి హ‌మ్ విధానంలో టెండ‌ర్లు పిలిచేలా అధికారులను నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లను మొదటి దశలో ఎంపిక చేశారు. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా కేవలం అక్కడి ట్రాఫిక్, వాహనాల సంఖ్య ఆధారంగా చేసుకొని పనులు చేపట్టాలని నిర్ణయించారు. జూలై నుంచి మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పనులు ప్రారంభించి, వాటిని నిత్యం పర్యవేక్షణ చేయడం ద్వారా సకాలంలో పూర్తి చేయొచ్చని, లేకుంటే వర్షాలకు పనులు సాధ్యం కావని, చేసినా నాణ్యతాపరమైన ఇబ్బందులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా పనుల ఎంపిక, టెండర్లు, అగ్రిమెంట్, పనులు జరిగే విధంగా చేయనున్నారు. అధికారులు, కింది స్థాయి సిబ్బంది నుంచి నివేదికలు తెప్పించుకొని మరోసారి పరిశీలిస్తున్నారు.

నిధుల కొరత లేకుండా..

వ‌చ్చే మూడేళ్లలో హ‌మ్ విధానంలో 12 వేల కిలోమీట‌ర్ల మేర ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్టాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం ద్వారా.. వారికి నిధుల కొరత ఏర్పడదు. దీంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకొస్తారని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పనులు కాంట్రాక్టర్లకు నిధులు రాకపోవడంతో పనులు చేసేందుకు వారు ముందుకు రాలేదు. ఓ దశలో పనులకు టెండర్లు వేయండి బాబూ అంటూ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లను బతిమాడాల్సిన పరిస్థితి వచ్చింది. పీఆర్, ఆర్‌అండ్‌బీ రెండు శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి రాకుండా 10 నుంచి 15 ఏండ్ల వ్యవ‌ధిలో బ్యాంకుల‌కు లోన్లు ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. ప్రభుత్వాలకు బ్యాంకులు సులువుగా రుణాలు ఇస్తాయి కాబట్టి నిధుల సమస్య రాదు. దీంతో గ్రామీణ రోడ్లకు రాబోయే రోజుల్లో మహర్దశ పట్టనుంది. పెరుగుతున్న వాహనాల సంఖ్య, వాటి సామర్థ్యం ఆధారంగా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పదేండ్ల పాటు నిర్వహ‌ణ బాధ్యత‌లు నిర్మాణ సంస్థకే అప్పగిస్తారు. దీంతో వారిలో జవాబుదారీతనం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Next Story